29-09-2025 12:00:00 AM
అబ్దుల్లాపూర్ మెట్ , సెప్టెంబర్ 28: పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పసుమామల సాయి విహార్ కాలనీలోని శివ సాయి కరుణామందిరం సాయిబాబా దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మహా చండీయాగం ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ చైర్మన్ పరంకుషా రావు ఆధ్వర్యంలో బాలాచార్యుల నేతృత్వంలో మహా చండీయాగం జరిగింది.
అనంతరం బాలాచార్యులు మాట్లాడుతూ... ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వెల్లివిరియాలని ఆశీర్వదించారు. దేవాలయ చైర్మన్ పరంకుషా రావు మాట్లాడుతూ.. ఇలాంటి ధార్మిక కార్యక్రమాల ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని, భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.