29-09-2025 12:00:00 AM
-డబ్బులు ఇచ్చుకో....
-అంతస్తు మీద అంతస్తు వేసుకో అక్రమ నిర్మాణాలను
-ప్రోత్సహిస్తున్న టీపీవోలు ఒక్కొక్కరికి రెండు, మూడు
-మున్సిపాలిటీల ఇన్చార్జి ఏసీబీకి చిక్కిన పెద్ద తిమింగలం
మేడ్చల్, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలలో టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా అవినీతి, అక్రమాలలో కూరుకుపోయింది. ఈ విభాగంలో పనిచేసే అధికారులు రెండు చేతుల అక్రమార్జన చేస్తున్నారు. ఒక్కో అధికారికి రెండు మూడు మున్సిపాలిటీలు ఇన్చార్జి ఉండడంతో ఆయా మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో అధికారి మూడు జిల్లాల్లో మూడు మున్సిపాలిటీలకు ఇన్చార్జిగా ఉన్నారు. ఒక్క మున్సిపాలిటీలో వారానికి రెండు రోజులకు విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ వీరు ఏ మున్సిపాలిటీకి సరిగా వెళ్లడం లేదు. ఒక్క మున్సిపాలిటీలో ఒక్కో ఏజెంటును నియమించుకున్నారు.
వారు అక్రమ నిర్మాణాల దారులతో సెటిల్మెంట్లు చేస్తున్నారు. వారే డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు. ఒక్క అంతస్తుకి ఇంత, షెడ్ల నిర్మాణానికి ఇంత అని రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీలలో ఎన్ని అక్రమ నిర్మాణాలకు జరుగుతున్న వీరు అడ్డుకునేది లేదు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన వీరు కళ్ళు మూసుకుని ఉంటున్నారు. టీపివోలు వసూలు చేసిన డబ్బులలో ఉన్నతాధికారులకు కూడా వాటాలు ఉన్నాయని అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ వ్యవస్థ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇన్చార్జి వ్యవస్థను తీసేసి రెగ్యులర్ టిపిఓ లను నియమించాల్సిన అవసరం ఉంది.
ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం
ఎల్లంపేట మున్సిపాలిటీ లో ఇన్చార్జి టిపిఓగా పనిచేస్తున్న రాధాకృష్ణారెడ్డి శనివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈయన ఎల్లంపేట తో పాటు మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ ఇన్చార్జి టీపివోగా పనిచేస్తున్నారు. ఈయనపై అనేక అవినీతి ఆరోప ణాలు ఉన్నాయి. పైకి నిజాయితీ అధికారిగా బిల్డప్ ఇస్తూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. మున్సిపాలిటీలో పాలకవర్గాలతోనూ దురుసుగా వ్యవహరించారు. ఈయనపై చర్యలు తీసుకోవాలని అనేకసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈయన చేసిన అవినీతి అక్రమాలపై సాక్షాదారాలతో సహా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చర్యలు తీసుకోలేదు.
అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దబాయించేవారు. ఇటీవల బీఎస్పీ నాయకుడు ముల్లంగిరి శ్రీహరి చారి, బిజెపి నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి మేడ్చల్ పట్టణంలో అక్రమ నిర్మాణాలపై టిపిఓ రాధాకృష్ణారెడ్డిని నిలదీశారు. అవినీతికి పాల్పడ్డారని అన్నారు. తాను వసూళ్లకు పాల్పడితే అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. ఆయన సవాలు చేసిన 15 రోజుల్లోనే ఏసీబీకి పట్టుబడడం గమనార్హం. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సోమారం గ్రామం వద్ద గ్రామపంచాయతీ హాయంలో గంగస్థాన్ పేరిట వెంచర్ వేశారు.
ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు. హెచ్‌ఎండిఏ నుండి అనుమతి తీసుకున్నారు. పక్కన భూముల వారు వెళ్లడానికి వీలుగా రోడ్లు వేయాలని నిబంధన ఉంది. వెంచర్ నిర్వాహకులు తాత్కాలికంగా ఆ ప్రాంతంలో గేట్లు ఏర్పాటు చేశారు. టీపిఓ రాధాకృష్ణారెడ్డి కన్ను ఆ గేట్ల మీద పడింది. గేట్లు, ప్రహరీ కూల్చి వేస్తానని, లేదంటే తనకు రూ. ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో నిర్వాహకులు వారం రోజుల క్రితం లక్ష రూపాయలు ఇచ్చి ఏసీబీ ని ఆశ్రయించారు. రూ .3.50లక్షలు తీసుకుంటుం డగా శనివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాధాకృష్ణారెడ్డి ఏసీబీకి చిక్కడం పట్ల మేడ్చల్, ఎల్లంపేట మున్సిపాలిటీల పరిధిలో కొందరు సంబరాలు చేసుకున్నారు.
మున్సిపాలిటీలలో కలకలం
ఎల్లంపేట మున్సిపాలిటీ టిపిఓ రాధాకృష్ణారెడ్డి ఏసీబీకి చిక్కడం జిల్లాలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో కలకలం సృష్టించింది. ఏసీబీ సోదాలు తెలియగానే అన్ని మున్సిపాలిటీలలో ఇదే విషయమే చర్చ జరిగింది. అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. ఎల్లంపేట మున్సిపాలిటీ ఇదే ఏడాది ఏర్పాటు అయింది. రాధాకృష్ణారెడ్డి ఇంచార్జి టిపిఓగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలలకే ఏసీబీకి దొరికారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు విధులు సరిగా నిర్వహించాలని, అక్రమ నిర్మాణాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.