calender_icon.png 27 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు దాటడమే యమగండం

27-12-2025 12:00:00 AM

  1. విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు 
  2. హయత్ నగర్ డివిజన్ పరిధిలో యాక్సిడెంట్లు 
  3. ఫుట్ పాత్ లేవు.. సిగ్నల్స్ లేవు..  స్పీడ్ బ్రేక్స్ లేవు 
  4. మితిమీరిన వేగంతో వస్తున్న వాహనాలు 
  5. కన్ను తెరిచేలోగా దూసుకొస్తున్న మృత్యువు 

ఎల్బీనగర్, డిసెంబర్ 26 (విజయ క్రాంతి): విజయవాడ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదాలకు అడ్డగా మారింది. ఎల్బీనగర్ నుంచి ఆందోళ్ మైసమ్మ ఆలయం వరకు విజయవాడ జాతీయ రహదారిని ఎనిమిది వరుసలుగా విస్తరించారు. కాగా, విశాలమైన రోడ్డు, ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రావడంతో వాహనాల వేగానికి అడ్డు అదుపూ లేకుండా పోయింది. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఎంతో మంది అకారణంగా మృతి చెందుతుండగా, కొందరు క్షతగాత్రులుగా మారి అంగవైకల్యంతో బాధపడుతు న్నారు. రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలు పెద్ద దిక్కు కొల్పోయి కుటుంబ సభ్యులు రోడ్డున పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతీయువకులు అర్ధాంతరంగా చనువు చాలిస్తున్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సూరాబాద్, హయత్ నగర్ డివిజన్ల పరిధిలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. రోడ్డు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన హామీలు నీటి ముటలుగా మారాయి. 

రోడ్డు దాటాలంటే గండం గడిచినట్లే 

విజయవాడ జాతీయ రహదారిని దాటితే యమగండం దాటినట్లే. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను నిర్మించడంతో ప్రజలు రోడ్డు దాటలేక పోతున్నారు. యూ టర్న్, ఫుట్ పాత్ నిర్మాణాలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు బారికేడ్లను దాటి వెళ్తున్నారు. ఇక్కడి యూటర్న్ దాటి రావాలంటే కిలో మీటర్ దూరం వెళ్లి, తిరిగి రావాల్సిందే. దీంతో పలువురు వాహనదారులు రాంగ్ రూట్లో వస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్,  హయత్ నగర్ డివిజన్ల పలు కాలనీలు రెండు ప్రాంతాలుగా విడిపోతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇక్కడికి... ఇక్కడి ప్రజలు అక్కడికి వెళ్లాలంటే సహాసయాత్ర చేయాల్సిందే. దీంతో ప్రయాణికులు అత్యంత ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ మధ్యలోనే నిలిచిపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 

ప్రమాదకరంగా మారిన ప్రాంతాలు 

మన్సూరాబాద్, హయత్ నగర్ డివిజన్ల పరిధిలోని లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, భాగ్యలత, పుల్లారెడ్డి స్వీట్ హౌస్ సమీపం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరిసర ప్రాంతం, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ యూ-టర్న్ వద్ద, హయత్ నగర్ డివిజన్ లోని సూర్యనగర్, వర్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ లోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డును అటుఇటు దాటే సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై భాగ్యలత నుంచి హయత్ నగర్ వరకు ఎక్కడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడంతో రోడ్డు దాటే సమయంలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. 

హయత్ నగర్ డిపో, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న వివిధ కాలనీల ప్రజలు రోడ్డు దాటలేక నిత్యం నరకయాతన పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా హయత్ నగర్ సూర్య నగర్ , ఆర్టీసీ కాలనీ, ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ సర్వీస్ రోడ్లు పూర్తిగా నిర్మించకపోవడంతో వాహనదారులు, ప్ర యాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సర్వీస్ రోడ్లకు ఆనుకుని ఉన్న కాలనీ రోడ్లకు ఇప్పటివరకు బీటీ రోడ్డు లింక్లు నిర్మించకపోవడంతో వాహనాలు అకస్మాత్తుగా ప్రధాన రోడ్డుపైకి రావాల్సి వస్తుం డటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు 

వారం రోజుల క్రితం ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఎంబీబీఎస్ చదువుతున్న యువతి తన తండ్రితో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై, అక్కడికక్కడే మృతిచెందారు. యువతి ప్రాణాలు కోల్పోవడం, ఆమె తండ్రికి తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. లెక్చరర్స్ కాలనీ వద్ద మూడు రోజుల క్రితం రాత్రి వేళ మరో యువకుడు ప్రమాదానికి గురయ్యాడు.

గతంలో భార్యాభర్తలు మృతి చెందారు.  లక్ష్మారెడ్డి పాలెం వద్ద మార్నింగ్ వాక్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అదనపు డీసీపీ మృతి చెందాడు. అర్ధరాత్రి వేళలో అనేక మంది ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో తీవ్రంగా గాయపడి, అంగవైకల్యంతో బాధపడుతున్నారు. కుటుంబ పెద్ద, చేతికి అందివచ్చిన కొడుకు, కూతురు, కొత్తగా పెళ్లయిన వారు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు.  విజయవాడ జాతీయ రహదారిపై సగటున ప్రతి పది రోజులకు ఒక ప్రమాదం జరుగుతుంది.

మంత్రి పరిశీలించినా పనులు ముందుకు సాగలేదు 

ఆగస్టు నెలలో రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. అనేక చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, పనామా - ఆటోనగర్, హయత్ నగర్ ఆర్టీసీ డిపో - హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు రెండు వంతెనలు నిర్మిస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. సర్వీసు రోడ్లు, లింక్ రోడ్డు పనులు కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. 

భద్రాతా చర్యలు తీసుకోవాలని ప్రజల ఆందోళన 

విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించాలని, భద్రతా ఏర్పాట్లు చేయాలని మన్సూరాబాద్, హయత్ నగర్ డివిజన్లకు చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు.  లెక్చరర్స్ కాలనీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ సమీపంలో, రోడ్డు అవతలి వైపు ఆక్సిస్ బ్యాంక్ సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్లు, సురక్షిత క్రాసింగ్ సదుపాయాలతో పాటు కాలనీ రోడ్లకు బీటీ లింక్ రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.