calender_icon.png 27 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాఫియా గుప్పిట్లో ‘ఎక్సైజ్’..!

27-12-2025 12:00:00 AM

  1. కల్తీ కల్లుకు అడ్డాగా జిల్లా కేంద్రం కామారెడ్డిలో వారిదే హవా
  2. ఏరులై పారుతున్న కల్తీ కల్లుకల్లు, లిక్కర్ వ్యాపారాల్లోవారిదే పెత్తనం
  3. కల్లు గీతాకార్మికుల అణచివేత మామూళ్ళ వాటాలో అధికారులు
  4. సర్కార్ జీతం కంటే ముందే అందుతున్న ప్యాకేజీ
  5. యథేచ్ఛగా నకిలీ మద్యం,కల్తీ కల్లు షరా మామూలే అంటున్న ఎక్సైజ్‌అధికారులు

కామారెడ్డి, డిసెంబర్ 26(విజయక్రాంతి):  కామారెడ్డి జిల్లా కేంద్రంలో  మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. వారు చెప్పిందే ఎక్సైజ్ అధికారులకు వేదం. ఉన్నతాధికారులకు ఒక ప్యాకేజీ, కింది స్థాయి ఉద్యోగులకు మరో ప్యాకేజీ చొప్పున వాటాలు వేస్తూ యథేచ్ఛగా తమ కల్తీ కల్లు, కల్తీ మద్యం వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. దీంతో మద్యం ప్రియుల జేబులు గుల్లవడమే కాకుండా ఆరోగ్యం సైతం పాడవుతుంది.కల్తీ కల్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

జిల్లా కేంద్రమైన కామారెడ్డితో పాటు జిల్లాలో ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. జిల్లాలో విచ్చల విడిగా కల్తీ కల్లు దుకాణాలు నడుపుతున్నారు. నాణ్యమైన చెట్టు కల్లును మాత్రమే విక్రయించాలి. అయితే చాలా చోట్ల అలా జరగడంలేదు.దుకాణాదారుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు కల్తీ కల్లు తయారీలో నిషేధిత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. ఫలితంగా చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్యం ధరలు పెరగడంతో తక్కువ రేటుకు వస్తున్న కల్లు వైపు జనం మొగ్గు చూపుతున్నారు.

పైగా మత్తు ఉండడంతో మందుబాబులు ఆకర్షితులవుతున్నారు. మాఫియా పెత్తనం... కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులే కల్తీ కల్లు వ్యాపారం కూడా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి కల్లు డిపోలను కల్లుగీతా కార్మికులు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. సొసైటీలో సభ్యునిగా ఉండి కల్లు దుకాణాలను వేలం పాట ద్వారా పొంది వ్యాపారం నిర్వహిస్తారు. అయితే ఇందుకు విరుద్ధంగా కల్లు గీతాకార్మికులను అణచివేతకు గురి చేస్తూ వారిపై మద్యం మాఫియా పెత్తనం చెలాయిస్తూ కల్తీకల్లు వ్యాపారం సాగిస్తున్నారు.

వ్యాపారం, వ్యవహారమంతా మాఫియా చేతిలోకి తీసుకొని లైసెన్సులు మాత్రం కల్లు గీతాకార్మికుల పేరుమీద తీసుకోవడం జరుగుతోంది. కామారెడ్డి జిల్లాలో కల్లు గీత కార్మికుల సొసైటీలు 64, విక్రయ కేంద్రాలు 119 , సభ్యులు 1489 ఉన్నట్లు అధికారులు తెలిపారు.అనుమతిలేని దుకాణాలతో కల్తీకల్లు...జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో లైసెన్స్ దుకాణాలు ఉండగా అంతకు రెట్టింపు అనుమతి లేని దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒకచోట లైసెన్సు దుకాణం ఉంటే దానికిందే మరో చోట దుకాణం ఏర్పాటు చేసి యథేచ్ఛగా కల్తీ కల్లు అమ్ముతున్నారు.

ఒక విధంగా మద్యం బెల్టు దుకాణాల మాదిరిగా కల్తీకల్లు దుకాణాలు సైతం వెలుస్తున్నాయి. ఇలాంటి దుకాణాల్లో వారు అమ్మిందే కల్లు అనే రీతిగా కల్తీకల్లు అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం.మత్తు పదార్థాలు వల్లే..సాధారణంగా కల్లులో మత్తు కోసం డైజోపాం, క్లోరో హైడ్రేడ్, తీపి కోసం శాక్రిన్, నురగ కోసం ఆమోనియం కలుపుతుంటారు. కల్లులో నేప్రోటాక్సిన్ అనే నిషేధిత మత్తు పదార్థాలు కలపడం వల్లే కల్లు సేవించిన వ్యక్తులు మృతిచెందుతున్నారు.

కండరాలపై ఈ మత్తు పదార్థాల ప్రభావం పడినప్పుడు శరీరంలోకి క్రియాటినైన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని, దీంతో మూత్రపిండాలు దెబ్బతినడం, గుండె, మెదడు, ఇతర ప్రధానమైన అవయవాలు దెబ్బతింటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వెంటనే డయాలసిస్ చేయకపోతే కల్తీ కల్లు సేవించిన వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుంది. ఒంటి నొప్పులతో మొదలై కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని, విచక్షణా కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

కల్తీ కల్లు బాధితులకు వైద్య చికిత్స సమయంలో ఇచ్చే మత్తు ఇంజక్షన్లు కూడా పని చేయవని, మోతాదుకు మించి డోస్ ఇవ్వాల్సి వస్తుందన్నారు.నిద్రమత్తులో ఎక్సైజ్ అధికారులు...కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎక్సైజ్ అధికారుల పనితీరు జిల్లా మద్యం సిండికేట్ వ్యక్తుల చేతుల్లో ఉందని, వారి ఉదాసీన వైఖరే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. నెలనెలా మామూళ్ల మత్తులో ఉండి వైన్ షాపులు, కల్తీకల్లు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఇష్టానుసారంగా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.

కానీ అప్పుడప్పుడు మందుబాబుల ఆగడాలు శృతి మించినపుడు స్థానికులు ఫిర్యాదు ఇచ్చినపుడే ఆబ్కారీ, పోలీసుల విభాగాలు హడావుడి చేస్తున్నాయి. అరకొర జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు.ఒకవేళ అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే ముందస్తుగా వ్యాపారులకు సమాచారం అందించేందుకు ఓ విభాగమే పనిచేస్తోందంటే అతిశయోక్తికాదు.