calender_icon.png 27 December, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమారుడిని హత్య చేసి నదిలో పడేసిన తండ్రి

14-09-2025 09:26:23 AM

హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్(Bandlaguda Police Station) పరిధిలోని సూరినగర్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మూడేళ్ల కుమారుడిని తండ్రి హత్య చేసిన అమానవీయ ఘటన కలకలం రేపింది. హత్య అనంతరం తండ్రి.. బాలుడి మృతదేహాన్ని సంచిలో పెట్టి నయాపూల్ వద్ద మూసి నదిలో పడేశాడు. కాగా కుమారుడు కనిపించట్లేదని తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రిపై అనుమానంతో పోలీసులు విచారించగా.. పోలీసుల విచారణలో తండ్రి మహమ్మద్ అక్బర్ నిజాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోలీసులు బాలుడు మృతదేహం కోసం మూసి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

మహ్మద్ అక్బర్(35), సనా బేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్బర్ కూరగాయల వ్యాపారం.. సనా నిలోఫర్ ఆసుపత్రిలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్నారు. తమ చిన్న కుమారుడు మహ్మద్ అనాస్(3) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడి వైద్యానికి ఖర్చు ఎక్కువ అవుతుందని తరచూ దంపతుల మధ్య గొడవలు కావడంతో, అనాస్‌ ను చంపేయాలని తండ్రి అక్బర్ నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి భార్య డ్యూటీకి వెళ్లాక, శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కొడుకు మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసాడు. అనంతరం మృతదేహాన్ని ఒక సంచీలో కుక్కి, నయాపూల్ బ్రిడ్జి వద్ద మూసీలో పడేసి, ఏమి తెలియనట్టు కూరగాయలు విక్రయించేందుకు వెళ్లాడు. ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన బిడ్డ కనపడడం లేదని ఫిర్యాదు చేయగా, ఇంటి పరిసరాల్లో పోలీసులు సీసీటీవీ పరిశీలించారు. ఉదయం 3 గంటలకు సంచితో వెళ్తున్న దృశ్యాలు చూపించి నిలదీయగా, తానే చంపి మూసీలో పడేసినట్టు తండ్రి అక్బర్ అంగీకరించాడు.