29-10-2025 12:46:30 AM
కొనుగోలువేటలో లిక్కర్ కింగ్‌లు
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా మద్యం షాప్‌లో నిర్వహిస్తూ కోట్లు కూడబెట్టిన మద్యం డాన్ లలోఎక్కువ శాతం ఏడాది నిర్వహించిన మద్యం షాపుల కేటాయింపుల్లో దుకాణాలు దక్కకపోవడంతో తలలు పట్టుకున్నారు.రక్తం రుచి మరిగిన పులి ఎలాగైతే గాండ్రిస్తూ వేటకు వెళుతుందో మద్యం షాపులు దక్కని లిక్కర్ కింగులు ఇప్పుడు గాండ్రింపులు మొదలుపెట్టారు.
జిల్లాలో 32 షాపులకు దరఖాస్తులు అధికారులు ఈ నెల 27న(సోమవారం) 25 మద్యం షాపులకు లక్కీ నిర్వహించారు. ఇందులో మద్యం షాపు దక్కని వారు ఎలాగై నా షాపు దక్కించుకోవాలని వేటకు దిగారు. 32 షాపులకు 680 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క గ్రూపు 5 దరఖాస్తుల నుండి 30 దరఖాస్తుల వరకు ఆయా షాపులలో వేశారు.ఏదైనా ఒక్క షాపు దక్కకుండా పోతుందా అని ఎంత ఆశతో ఎదురు చూసిన వారికి అడియాశలే మిగిలాయి.
ఈ ఏడాది ప్రభుత్వం ఒక్కో షాపు కు మూడు లక్షల రూపాయలు కేటాయించడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 2023లో నిర్వహించిన మద్యం షాప్‌లో టెండర్‌లో 1020 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది 340 దరఖాస్తులు తగ్గాయి. మూడు లక్షల రూపాయలు కావడంతో షాపు దక్కక పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు నష్టపోయారు.
మద్యం షాపుల నిర్వహణలో నిండా మునిగి తేలిన వ్యాపారులకు ఏడాది ఒక్క షాపు కూడా రాకపోవడంతో ఎలాగైనా షాపులను కొనుగోలు చేసి వ్యాపారంలో ఉండాలని భావిస్తున్నారు.టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యక్తులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏళ్ల తరబడి లిక్కర్ వ్యాపారంలో రాణిస్తున్న వారు షాపు కొనుగోళ్ల కోసం వేట మొదలుపెట్టారు.ఒక్క ప్రాంతాన్ని బట్టి షాపు రేటును ఫిక్స్ చేస్తున్నారు.గతంలో కొంతమంది వ్యాపారులు 50 లక్షల రూపాయల పైనుండే షాపులను కొనుగోలు చేసి వ్యాపారం చేశారు.
అధికారుల అండదండలతో సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు మద్యం విక్రయించి లక్షల రూపాయలు కూడబెట్టిన వ్యాపారులు ఎలాగైనా మద్యం వ్యాపారం నుండి వైదొలగ వద్దని భావిస్తున్నారు. మద్యం వ్యాపారంలో ఆరితేరిన వ్యాపారస్తులకు ఈ ఏడాది కొంతమందికి మద్యం షాపులు దక్కలేదు.దీంతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యాపారులు మద్యం షాపులు దక్కించుకున్న చిన్నచితక,మధ్యతరగతి వారిని ఇప్పటినుండే భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు.
షాపును విక్రయించకుంటే ఎట్టి పరిస్థితుల్లో సిండికేట్ కానిచ్చే ప్రసక్తే లేదని పలువురి ద్వారా రాయబారం పంపిస్తున్నారు.కొన్ని ఏళ్లుగా వ్యాపారంలో ఉన్న వారికి షాపుల నిర్వహణలో లొటుపాట్లు అన్నీ తెలిసి ఉండడం, అధికారులను ప్రసన్నం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య.దీంతో కొత్తగా షాపు వచ్చిన వ్యక్తులు గతంలో మద్యం షాపులు నిర్వహించిన వారిని పార్ట్నర్ గా చేర్చుకోవాలని కొంతమంది భావిస్తున్నారు.