29-10-2025 12:44:45 AM
వేధింపులకు బలైన ఈజీఎస్ టిఏ భార్గవ్ ?
కాసిపేట (బెల్లంపల్లి), అక్టోబర్ 28: మం చిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీవో కె. మహేందర్ లంచావతారానికి ఈజీఎస్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దుగుట భార్గవ్ అనే ఉద్యోగి బలైనట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఎంపీడీవో మహేందర్ పెడుతున్న ఇబ్బందులు తాళలేక దుగుట భార్గవ్ గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
కాసిపేట మండలం ముత్యం పల్లి గ్రామానికి చెందిన దుగుట భార్గవ్ 8 ఏళ్లుగా బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మండల పరిషత్ అధ్యక్షుల పాలన ముగియడంతో ఎంపీడీవో అన్నీ తానే వ్యవహరిస్తూ ఉద్యోగుల నుండి నెలనెలా వసూళ్లకు పాల్పడుతున్నారు. భార్గవ్ మృతితో ఎంపీడీవో మహేందర్ ఉద్యోగుల నుండి చేస్తున్న వసూళ్ల దందా బహిర్గతమైంది.
గత కొన్నేళ్లుగా ఉద్యోగులను మానసికంగా వసూళ్ల కోసం ఎంపీడీవో మహేందర్ తీవ్రంగా వేధిస్తున్న తీరును ఈజీఎస్ ఉద్యోగులు బాహా టంగా చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. కార్యాలయానికి వచ్చే వారిపట్ల అమర్యాదగా వ్యవహరించడమే కాకుండా ఉద్యో గులను, సిబ్బందిని హేళన చేసి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మండలానికి చెందిన ఒక కీలక నేతకు ఎంపీడీవో కొమ్ము కాస్తూ ఉద్యోగుల నుండి నెలనెలా వసూళ్ల దందాను సాగిస్తున్నారు.
రోజు కార్యాలానికి వచ్చి ఫీల్ విజిట్ పేరుతో గ్రామాలకు వెళ్లి తన క్లస్టర్ పరిధిలోని ఈజీఎస్ సిబ్బందికి మెమోలు జారీ చేస్తున్నాడని ఈజీఎస్ ఉద్యోగి అనిల్ తన గోడు వెల్లబోసుకున్నారు. డబ్బులు లంచంగా ఇవ్వకుంటే మెమోలు జారీ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో మహేందర్ వేధింపులు తాళలేక క్లస్టర్ ఉద్యోగుల తరఫున నెల నెల రూ 10 వేల వరకు డబ్బులు చెల్లించామని వాపోయాడు.
లంచాల ముసుగులో ఉద్యోగులు, సిబ్బందిని మానసికంగా వేధిస్తూ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ దుగుట భార్గవ్ మరణానికి కారణమైన ఎంపీడీవో మహేందర్ ను విధుల నుండి తొలగించాలని మాజీ ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్, నేతకాని మహర్ నాయకులు శ్రీకాంత్ డిమాండ్ చేస్తున్నారు.