30-07-2024 12:24:01 AM
కుటుంబ కలహాలే కారణం
రాజన్న సిరిసిల్ల, జూలై 29 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన దూస రాజేశం(54), లక్ష్మి(50) దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు వేణు, కూతురు మౌనికకు వివాహం కాగా చిన్న కొడుకు వెంకటేష్ చదువుకుంటున్నాడు. రాజేశంకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో కొన్ని రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు.
అప్పటి నుంచి వారి జీవితంలో కలహాలు మొదలయ్యాయి. దానికి తోడు గత ఆరు నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో తరుచూ ఇంట్లో గొడవలు జరిగేవి. భార్య సూటి పోటి మాటలకు రాజేశం విసుగు చెందాడు. ఈ క్రమంలోనే సోమవారం మళ్లీ ఇద్దరూ గొడవపడ్డారు. క్షణికావేశంలో బలమైన వస్తువుతో లక్ష్మి ముఖంపై కొట్టి హత్య చేశాడు. అనంతరం రాజేశం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశం కుటుంబంలో ఉపాధి లేమి సమస్య భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీసిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.