calender_icon.png 14 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోమటిరెడ్డి x జగదీశ్‌రెడ్డి

30-07-2024 12:24:32 AM

చిల్లర దొంగతనాలు, కిరాయి హత్యలు!

  1. జగదీశ్.. ఇదీ నీ చరిత్ర 
  2. మంత్రి కోమటిరెడ్డి ధ్వజం

జగదీశ్‌రెడ్డి సవాల్ స్వీకరణ

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. జగదీశ్‌రెడ్డి చరిత్ర నల్లగొండ జిల్లా అంతా తెలుసని అన్నారు. ఆయన చరిత్రంతా చిల్లర దొంగతనాలు, కిరాయి హత్యలేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. అప్పటి పంచాయతీ సమితి చైర్మన్ మదన్ మోహన్‌రెడ్డి హత్య కేసులో జగదీశ్‌రెడ్డి ఏ ఉన్నారని ఆరోపించారు. మరో కేసులో జగదీశ్‌రెడ్డి, ఆయన తండ్రి ఏషూ6, ఏషూ7గా ఉన్నారని, కోర్టుల చుట్టూ తిరిగిన చరిత్ర జగదీశ్‌రెడ్డిదని విరుచుకుపడ్డారు.

సూర్యాపేట మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్‌కు సంబంధించిన పెట్రోల్ బంకులో, ఇతర రైసు మిల్లుల్లో చోరీలు చేసిన చరిత్ర జగదీశ్‌రెడ్డిదని ధ్వజమెత్తారు. కోర్టు ఏడాదిపాటు జగదీశ్‌రెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించిందని ఆరోపించారు. జగదీశ్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కోర్టు నుంచి, జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెప్పించాలని స్పీకర్‌ను మంత్రి కోరారు. తాను నిరూపిస్తే జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని, ఒకవేళ నిరూపించకపోతే తాను ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జగదీశ్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించారు.

మీరు కేసీఆర్ కాలిగోటికి సరిపోరు

  1. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్
  2. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యం
  3. కేసులు ఉన్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తా!

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): విద్యుత్తు అంశంపై శాసనసభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. అధికార పార్టీపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘మీరంతా కేసీఆర్ కాలిగోటికి సరిపోరు’ అని కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు సైతం దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేయడంతో సభ వాతావరణం వేడెక్కింది. అంతకుముందు విద్యుత్తుపై జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ, నాటి సీఎం కేసీఆర్ కూర్చొని రైతుల మోటర్లకు మీటర్లు పెట్టడంపై సంతకాలు పెట్టారని ఏవో పేపర్లు తెచ్చి చదివి సభను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే రూ.30 వేల కోట్లను నాడు తాము వదులుకున్నట్టు జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు.

‘ఉదయ్’ పథకంలో దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాలు చేరాయని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్తు రంగంపై దృష్టిసారించి, అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్తు సరఫరా చేశామని చెప్పారు. పదేళ్లలో విద్యుత్తు రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, విద్యుదుత్పత్తిని పెంచామని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఒక యూనిట్‌కు రూ.3.90తో విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రామగుండం ఎన్టీపీసీ నుంచి ఒక యూనిట్‌కు రూ.5.70 చెల్లిస్తుందని అన్నారు. అభివృద్ధి కోసం అప్పులు చేయొద్దా? నోట్లు ముద్రించాలా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం అప్పుల్లోనే ఉందని గుర్తుచేశారు. 

మంత్రి, సీఎంకు జగదీశ్ సవాల్

తనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన నేరారోపణలపై హౌజ్ కమిటీ వేయాలని జగదీశ్‌రెడ్డి కోరారు. వాటిని నిరూపిస్తే తన సీటు నుంచి స్పీకర్ చైర్ వరకు ముక్కు నేలకు రాసి, రాజీనామా చేస్తానని చెప్పారు. నిరూపించకుంటే వెంకట్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తనపై కక్షపూరితంగా మూడు కేసులు పెట్టారని, ఆ కేసుల్లో తాను నిర్దోషినని రుజువైందని స్పష్టంచేశారు.  తనపై, కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. కరెంట్ రావడంలేదని హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తున్నవారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.