19-12-2025 12:00:00 AM
నాయకులను కలిసేందుకు తరలివచ్చిన సర్పంచ్‌లు
నారాయణఖేడ్, డిసెంబర్ 18: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున తమ అనుచర గణంతో నారాయణఖేడ్ పట్టణానికి గురువారం తరలివచ్చారు. ప్రత్యేక భాజా భజంత్రీలు, టపాసులు కాలుస్తూ, డాన్స్లు చేస్తూ తమ నాయకుల ఇళ్లకు తరలి వెళ్లారు. గెలుపొందిన అభ్యర్థులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్లను కలిసి సర్పంచ్ అభ్యర్థులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థానిక బిఆర్‌ఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ని కలిసి బిఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన అభ్యర్థులు కలిసి శుభాభినందనలు తెలియజేసుకున్నారు. బిజెపి నుండి గెలుపొందిన అభ్యర్థులు, వార్డు మెంబర్లు మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డినీ కలిశారు. దీంతో నారాయణఖేడ్ పట్టణం వివిధ పార్టీల నాయకులు,జెండాలతో, కార్యకర్తలతో ఎటుచూసినా కోలాహలం నెలకొంది. గ్రామాల నుండి గెలుపొంది వచ్చిన సర్పంచ్ అభ్యర్థులను వారి నాయకులు కలుస్తూ వారిని ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.