08-10-2025 12:32:12 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట.అక్టోబర్ 7(విజయక్రాంతి) : వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆదర్శ ప్రాయుడు అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.వాల్మీకి మహర్షి జీవితం, బోధనలను గౌరవించడానికి వాల్మీకి జయంతిని నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. రామాయణం రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను జి ల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో అధికారికంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... రత్నాకరుడి నుంచి మహర్షి వాల్మీకిగా ఆయన పరివర్తన, వ్యక్తిగత వృద్ధి, విముక్తిని సూచిస్తుందని, ఆయన రామాయణాన్ని సృష్టించి న గొప్ప ఋషి అని కొనియాడారు. వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి అన్నారు. రామాయణాన్ని రాసిన ఆయనను సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారన్నారు.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని వాల్మీకి జీవిత చరిత్ర చెబుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గాంగ్వర్, శ్రీను, ఎస్. డీ. సీ రాజేందర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, కలెక్టరేట్ ఏ వో జయసుధ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖలీల్, డీపీఆర్ వో ఎం. ఏ. రషీద్, సీపీవో యోగానంద్, వసతి గృహా వార్డెన్లు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.