08-10-2025 12:33:56 AM
ముషీరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : కోర్టు తీర్పు ఎలా ఉన్నా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు బాధ్యత ప్రభుత్వాలదేనని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఖరారు కానంతవరకు స్థానిక సంస్థల ఎలక్షన్లను వాయిదా వేయాలన్నా రు. పార్టీ పరమైన రిజర్వేషన్లు మాకు వద్దు అని, రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ముద్దు అని పేర్కొన్నారు. మేరకు మంగళవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ప్రజా ఐక్య కూటమి కన్వీనర్ దాసు సురే ష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య, తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు మాజీ ఎమ్మె ల్యే వన్నాల శ్రీరాములు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏరుకొండ హైమావతి డాక్టర్ సాంబశివరావు పాలూరు రామకృష్ణ తదితరులు హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తిరుగుబాటు దిశగా కొనసాగుతున్న తదుపరి బీసీల ఉద్యమాలు అణిచివేతకు గురి చేస్తే చివరకు మిగిలేది విప్లవమేనన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆర్టికల్ 9 మాత్రమే శరణ్యమని ఆయన పేర్కొన్నారు. ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలుకు అండగా నిలబడకపోతే పార్టీలను అగ్రవర్ణ నాయకులను రాష్ట్రవ్యాప్తంగా స్తంభింప చేస్తామన్నా రు.
ఎమ్మెల్సీ మధుసూదనా చారి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు సమాన అవకాశం ఉండాలని బీసీలు కోరుతుంటే, జనాభాను మించి అవకాశాలను అనుభవిస్తున్న ఓసీలు బీసీల రిజర్వేషన్లకు అడ్డు తగలడం ముమ్మాటికి క్రూరమైన చర్య అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ఐక్య కూటమి కన్వీనర్ దాసు సురేష్ బీసీ రాజ్యాధికార సమితి ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్ గౌడ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కిషోర్, గట్ల రాజన్న, వంగ రవి యాదవ్, మహిళా అధ్యక్షురాలు ఏరుకొండ హైమావతి, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, సరస్వతి, బాయక్క తదితరులు పాల్గొన్నారు.