calender_icon.png 13 November, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15న బెల్లంపల్లికి సీపీఐ శతాబ్ది బస్సు జాత రాక.. కరపత్రం ఆవిష్కరణ..

13-11-2025 06:37:48 PM

బెల్లంపల్లి అర్బన్: భాషెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో గురువారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సీపీఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ సీపీఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాల ముగింపు భారీ బహిరంగ సభ డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సభకు అన్ని రాష్ట్రాలతో పాటు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ముగింపు సభకు రాష్ట్రంలో మూడు జాతాలను వస్తున్నాయన్నారు. అందులో బాగానే ఈనెల 15వ తారీకు నుండి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ నుండి బస్సు జాత ప్రారంభమవుతుందరన్నారు.

ఈ జాతాకు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేనా శంకర్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కే మణికంఠరెడ్డి నాయకత్వం వహిస్తారని తెలిపారు. ప్రజానాట్యమండలి కళారూపాలతో జాతలో ముందుంటదన్నారు. మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల నుండి 100 బైకుల ర్యాలీ ఈ జాతాలో పాల్గొంటదన్నారు.

ఈ జాత ఈనెల 15న ఉదయం 11 గంటలకు జోడేఘాట్ లో మొదలై, ఆసిఫాబాద్, రెబ్బెన, తాండూర్, బెల్లంపల్లి, సోమగూడెం, మందమర్రి, రామకృష్ణాపూర్, మంచిర్యాలకు చేరుకుని సాయంత్రం 6:30 గంటల సభతో ముగుస్తుందనీ వెల్లడించారు. ఇక్కడి నుంచి వెళ్ళే జాత 21న  భద్రాచలంలో ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం  తదితరులు పాల్గొన్నారు.