12-12-2025 01:08:27 AM
వైద్యుల నిర్లక్ష్యమే అంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
ఆదిలాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాం తి): మగ బిడ్డ పుట్టాడనే ఆనందం ఆ కుటుంబంలో ఎంతో సేపు నిలలేదు. ప్రసవం అయిన కొద్ది సేపటికే తల్లి తో పాటు పుట్టిన బిడ్డ మృతి చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ రిమ్స్‌లో చోటు చేసుకుంది. పుట్టిన వెంటనే పసికందు మృతి చెందటం, తరువాత కొద్ది సేపటి వ్యవధిలో ఆ బాలింత కూడా మృతి చెందటం కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది.
తల్లి బిడ్డల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబీకుల వివరాల ప్రకారం... ఉట్నూర్ మండలం హస్నా పూర్ పీహెచ్సీ పరిధిలోని పట్లగూడ గ్రామానికి చెందిన మూతి గంగశీల (34) అనే గర్భిణి ప్రసవం కోసం ఈనెల 9న రిమ్స్ లో చేరింది. బుధవారం రాత్రి పురిటి నొప్పుల రావడంతో వైద్యులు డెలివరీకి ఏర్పాట్లు చేశారు. గురువా రం తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనిచ్చింది.
కొద్ది సేపటికే శిశువు మృతి చెందగా బాలింత, కుటుంబీకులు తట్టుకోలేకపోయారు. అయితే దీనికి తోడు బాలింత కూడా కొద్ది సేపటికి అనూహ్యంగా తనువు చాలించింది. ఇక కుటుంబ సభ్యుల బాధ వర్ణణా తీతం. కాగా ఇద్దరు ఆడపిల్లలు కాగా మగబిడ్డ జన్మించాడని ఎంతగానో సంతోషించినా కుటుంబ సభ్యుల సంతోషం క్షణల్లోనే ఆవిరి అయింది. తల్లీబిడ్డలు మృత్యువు ఒడిలోకి చేర్చటంతో వారి రోదనలు మిన్నంటాయి.
ఇదిలాఉంటే తల్లి బిడ్డల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ టూటౌన్ పోలీస్ స్టేష న్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కుటుంబీకులు రిమ్స్ మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఏజెన్సీ వైద్యాధికారి డాక్టర్ మనోహర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, టుటౌన్ సీఐ నాగరాజ్ మార్చురీ చేరుకుని వారిని మాట్లాడి సముదాయించారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని డైరెక్టర్ వివరించారు.