31-08-2025 01:01:16 AM
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్ (విజయక్రాంతి);ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా విలసిల్లుతూ.. సింహాలు (కేసరులు) పెద్ద సంఖ్యలో సంచరించడం వల్ల వాటి అడుగుల జాడలు (పాదముద్రలు) కనిపించడంతో ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణాన్ని నాడు ‘కేసరి ముద్ర’గా పిలిచేవారని చరిత్ర ఆధారాలున్నాయి.
కాకతీయుల కాలంలో.. ఆ తర్వాత నైజాం పాలనలో దట్టమైన అడవులతో ఈ ప్రాంతానికి పెట్టింది పేరుగా నిలిచింది. అనేక సామ్రాజ్యాలను పాలించిన రాజులు, కాకతీయులు, నైజాం పాలకులు ఈ ప్రాంతంలో జంతువుల వేటకు వచ్చేవారని చెబుతారు. కాలక్రమేనా దట్టమైన అడవి తొలగి వ్యవసాయ భూములుగా మారడం, వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య పెరగడంతో గ్రామాలుగా ఏర్పడటంతో దట్టమైన అరణ్యంతో కూడిన నాటి ‘కేసరి ముద్ర’ కాస్త నేడు ‘కేసముద్రం’గా రూపాంతరం చెందింది.