11-07-2025 06:35:07 PM
బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం, కలెక్టర్ హరిచందన సమీక్ష
సనత్‌నగర్(విజయక్రాంతి): జూలై 13న జరగనున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను దృష్టిలో పెట్టుకుని బుధవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన సతీమణి దేవీ వర్మ మహాకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బోనం సమర్పించి, పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయానికి వచ్చి గవర్నర్ దంపతులను ఆత్మీయంగా ఆహ్వానించి, ఆలయ విశిష్టతను వివరించారు.
ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన కూడా ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు, వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, శానిటేషన్, ఎలక్ట్రికల్ తదితర శాఖలతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ... "భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సరఫరా, తాత్కాలిక వైద్య శిబిరాలు, శౌచాలయాల ఏర్పాటు వంటి అంశాల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించాను" అని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... "తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రభుత్వం పబ్బాలుగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాం. మహంకాళి ఆలయంలో జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, డీసీ డాకు నాయక్, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.