calender_icon.png 11 July, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13న మహంకాళి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి

11-07-2025 06:28:40 PM

భక్తుల రాకపై ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఈ నెల 13 వ తేదీన జరిగే మహంకాళి జాతరకు(Mahankali Fair) వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) తెలిపారు. శుక్రవారం మహంకాళి ఆలయ పరిసరాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. అమ్మవారి వడిబియ్యం పోసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు మన అందరి పండుగ అని, గొప్పగా జరుపుకుందామని కోరారు. బోనాల సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి దర్శనం, బోనాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమ్మ వారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని భక్తులు మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. 13 వ తేదీన తెల్లవారు జామున 3 గంటల నుండే బోనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. భక్తులు క్యూ లైన్ లో ఇబ్బందులు పడకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం CC కెమెరాల ఏర్పాటు చేయడమే కాకుండా, వివిధ ప్రాంతాల నుండి అదనపు పోలీసు సిబ్బందిని రప్పిస్తున్నట్లు వివరించారు. భక్తులకు త్రాగునీరు అందించేందుకు వాటర్ వర్క్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలలోని ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ వంటి పలు సంస్థలు వాలంటీర్ లుగా భక్తులకు సేవలు అందిస్తారని చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించి జరపాలని ఉమ్మడి రాష్ట్రంలో డిమాండ్ ఉన్నదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి KCR రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

బోనాల ఉత్సవాలను వైభవంగా జరపాలని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలే కాకుండా ప్రయివేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఏకైక ప్రభుత్వం అన్నారు. ఇందుకోసం 15 కోట్ల రూపాయల ను కేటాయించి ఖర్చు చేసినట్లు వివరించారు. నాటి నుండి యధావిధిగా ఈ కార్యక్రమం కొనసాగుతున్న దని, నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతనే బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఏర్పాట్ల విషయంలో తాను అధికారులతో పర్యవేక్షణ చేస్తున్నానని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.