03-04-2025 01:02:03 AM
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాం తి): కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమి ముమ్మాటికీ ప్రభుత్వానిదే నని, హెచ్‌సీయూకు సంబంధించి ఇంచు భూమి కూడా తీసుకోలేదని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు విద్యార్థులను పావులుగా వాడుకొని సర్కార్‌పై బురదజల్లే పనిచేస్తున్నాయని ఆరోపించారు. వారి వలలో పడొద్దని విద్యార్థులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. 20 ఏళ్లుగా వివాదంలో ఉన్న ఈ భూముల వ్యవహారమై బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నా రు. ఈ భూములను కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ము కాసినట్టుగా వ్యవహరించిందన్నారు.
అందుకే వారు అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపలేదని మండిపడ్డారు. తెలంగాణకు పెట్టుబడులు తీసు కొచ్చేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, రాష్ట్ర ఆదాయం పెరిగేలా ఈ భూములను టీజీఐఐసీకి సర్కారు అప్పగించిందన్నారు. మరో హైటెక్ సిటీ తరహాలో ఇక్కడ సంస్థలను నెలకొల్పి రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా చూస్తామని జూపల్లి హామీ ఇచ్చారు.
దేశంలో గత పదేళ్లలో 16 లక్షల ఎకరాల అడవిని నాశనం చేసిన బీజేపీకి కంచ గచ్చిబౌలి భూములపై మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. 10 లక్షల మందితో మీటింగ్ అంటున్న బీఆర్‌ఎస్ పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని జూపల్లి ప్రశ్నించారు.