calender_icon.png 8 August, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పునరుద్ధరిస్తే కాంగ్రెస్ పూడ్చేస్తుంది

08-08-2025 01:44:00 AM

సముద్రాలలో గాండ్లవారికుంట పూడ్చివేతపై మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఫైర్

హుస్నాబాద్, ఆగస్టు 7 : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలోని గాండ్లవారికుంటను అక్రమంగా పూడ్చివేసిన ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ చర్యపై మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“బీఆర్‌ఎస్ పునరుద్ధరిస్తే కాంగ్రెస్ పూడ్చేస్తంది,” అంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించిన చెరువుకుంటలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం లేదని మండిపడ్డారు.

గాండ్లవారికుంట పూడ్చివేత గురించి తెలుసుకున్న సతీశ్ కుమార్ గురువారం సముద్రాల గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా కుంట కట్టను తొలగించి, కుంటను పూడ్చివేశారని ఆరోపణలు వచ్చాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలను పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించారని సతీశ్ కుమార్ గుర్తు చేశారు.

ఈ పథకం కింద ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ఐదువందలకు పైగా చెరువులు, కుంటలను పునరుద్ధరించామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు ప్రజల అవసరాల కోసం ఉన్న చెరువులను పూడ్చివేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పాల్పడుతూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.

ధ్వంసమైన కుంట కట్టను పునర్నిర్మించాలని, గతంలో హరితహారం పథకంలో భాగంగా కట్టపై నాటిన ఈత చెట్లను తిరిగి నాటించాలన్నారు. ఈ అక్రమాలకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అక్రమాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా  అందరూ కలిసికట్టుగా పోరాడాలని  పిలుపునిచ్చారు.