08-08-2025 01:44:04 AM
- మోడీని దించుతామంటే బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదు ?
- రాష్ర్టంలో కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 600 మంది రైతుల
- ఆత్మహత్యలు రుణమాఫీ పేరుతో రైతులను వంచించారు
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మెదక్, ఆగస్టు 7(విజయక్రాంతి): కేంద్రంలో మోడీని దించుతామని సీఎం రేవంత్‌రెడ్డి అంటుంటే..తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదు... రాష్ర్టంలో కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ అయ్యారని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్‌రావు, నిరంజన్‌రెడ్డి హాజరై మాట్లాడారు.
కాగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో హరీష్‌రావు ధర్నా నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ మోడీ, రేవంత్ కేసిఆర్ పై ఒంటి కాలుతో లేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లు పరస్పర సహకారం చేసుకున్నాయని విమర్శించారు. రాష్ర్ట బీజేపీ మోడీ వైపు ఉందా లేక రేవంత్ వైపు ఉందా తేల్చాలని చెప్పారు. బీజేపీలో ఈటల రాజేందర్, వెంకట రమణరెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు తప్ప అందరూ రేవంత్ కు వత్తాసు పలుకుతున్నారన్నారు.
బీజేపీకి రైతుల మీద ప్రేమ లేదని, ఆ పార్టీ వ్యాపారస్తుల పార్టీ అని దుయ్యబట్టారు. తెలంగాణలో రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా చేసే దుస్థితి రావడం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 600 రోజులైందని, రోజుకొక్కరు చొప్పున 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. రైతుబంధు రూ.15వేలు, రెండు లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ అంటూ కాంగ్రెస్ ఆశ చూపడంతో రైతులు నమ్మి మోసపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇటీవల రైతుబంధు ఇచ్చిందని అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నమ్మి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేస్తే రైతుబంధు పూర్తిగా బంద్ అవుతుందన్నారు.
రుణమాఫీ అంతా ఉత్తదే...
రెండు లక్షల రుణమాఫీపై గొప్పలు చెప్పి కేవలం 20వేల కోట్లు కూడా మాఫీ చేయలేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. 42వేల కోట్ల రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సకాలంలో యూరియా సిద్దం చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ నేతల దందాలు తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకవైపు ప్రజలు, బీఆర్‌ఎస్ ఒకవైపు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో సరియైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్, దుబ్బాక ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి, మల్లిఖార్జున్‌గౌడ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ పాల్గొన్నారు.