calender_icon.png 8 August, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న కరీంనగర్‌లో ‘బీసీ గర్జన’

07-08-2025 11:52:22 PM

బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహణ..

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..

హైదరాబాద్ (విజయక్రాంతి): ఈ నెల 14న కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ బీసీ గర్జన నిర్వహించనున్నట్లు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former Minister Talasani Srinivas Yadav) తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే బీసీల సత్తా ప్రభుత్వానికి చూపుతామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీసీ నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. అఖిలపక్షంగా పిలిస్తే తాము కూడా ఢిల్లీకి వస్తామని సీఎంకు చెప్పినట్టు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఏ విధంగా తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చిందో.. అదే విధంగా తెలంగాణలో చేయాలని తాము చెప్పినట్టు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు. మమ్మల్ని ఢిల్లీకి తీసుకువెళ్తే వాళ్ల మోసం బయటపడుతుందని అఖిలపక్షాన్ని తీసుకువెళ్లలేదన్నారు. తమిళనాడు రిజర్వేషన్ల సమయంలో సీఎంగా ఉన్న జయలలిత ప్రధానిని, అన్ని పార్టీలను ఒప్పించి రిజర్వేషన్లు సాధించారని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్‌లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయని, విద్య, ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎండగడతామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.