calender_icon.png 13 November, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ భాష నిత్య నిర్మాణంలో ఉండాలి!

10-11-2025 12:00:00 AM

రాతి మూర్తి దర్శనంతో 

మన కళ్లు చెమర్చడం జీవుల చేతనకు రుజువు

దేహాల్లో అమర్చబడిన అదృశ్య సంకేతాల బురుజు

మేఘాలు జుట్టు విరబోసుకొని

పాశాల్లా అల్లుకొని పీకలు చుట్టుకుంటున్నాయి 

గొడుగులు అల్లడం లేదు

ఛత్రాల్లాంటి భాషలు అల్లడం లేదు

ఒక్కో భాషా ఒక్కో ఛత్రం.. నవరసాల అక్షరాభ్యాసం

నవ మేధో విన్యాసాల్లో కోడెదూడలా నలిగిపోతుంది 

ప్రహేళికల్లాంటి రోడ్ల విన్యాసాలు

నేల, సముద్రాలు, పర్వతాలను మింగేస్తున్నాయి

ప్రాణాంతక ఉదయాలుగా సూర్యబింబాలు పూస్తున్నాయి

ఒప్పందాలన్నీ ఇంధనాలను ఆశించి జరుగుతున్నాయి 

ప్రాణ ధనాలు, ఆకలి, అవమానం, 

జాత్యాహంకారాలతో ఆవిరైపోతున్నాయి !

కదిలే పాదాలు, నడిచే రోడ్లు,

కనబడే వాకిళ్లు అసలైన ఆనవాళ్లు

ఆనంద చిరునామాలకైనా, విషాద మైదానాలకైనా

వానలకి గొడుగుల్లాంటి భాషలూ

సాంకేతికత కాలిగిట్టల కింద నలగని

ప్రాణానుభూతి భాషలూ

మనస్సులని అనుసంధానించే

విశ్వప్రేమ భాషలూ... నిత్య నిర్మాణంలో ఉండాలి !

 ఒబ్బిని సన్యాసిరావు