calender_icon.png 13 November, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రియలు ఆగవు!

10-11-2025 12:00:00 AM

ఏవీ ఆగవు.. అకస్మాత్తుగా వచ్చి

తన పని చేసుకు పోతుంటాయి

కొన్ని మనల్ని తాకి

కొన్ని మనల్ని అతలాకుతలం చేసి

వాటి పనై పోయినట్లు పోతుంటాయి

అప్పుడే.. మన పని మొదలవుతుంది !

బతకాలి.. ‘బతుకు జీవుడా’ అని కాకుండా

భూమ్మీద పాదాల్ని

బలంగానే మోపుతూ వుండాలి

బతకటంలోనే

మన యుద్ధ పటిమ దాగుంటుంది !

హుద్‌హుద్.. తిత్లీ.. మొంథా

కన్నీళ్లూ కనికరం లేని వరదలు

ఏదైనా.. ఏవైనా వచ్చి పోనియ్..

నువ్వు మాత్రం చలించకు 

నీ పోరాటమే గొప్ప క్రియ తెలుసుకో ! 

అన్నీ కోల్పోయినా మీసం మెలేయ్ ! 

ప్రాణాన్ని కాపాడుకున్నావు చూడు

నీకు నువ్వే నిలబడ్డావు చూడు

అదే నీ గుండె ఘీంకారం

అదే నీ అస్తిత్వానికి శ్రీకారం

బలా బలాలను చూడటానికో 

భయభ్రాంతుల చీకట్లను చిమ్మటానికో 

అవి వచ్చిపోతుంటాయి !

బతుకులోనూ సముద్రం లోనూ

ఆటుపోట్లు తప్పక ఉంటాయి

అవి రేయింబవళ్ల భ్రమణ సౌందర్యాలు మాత్రమే సుమీ!

ప్రారంభం నుంచి ముగింపు వరకూ 

సాగి పోవాలంతే

ఏ క్రియలూ ఆగవు.. ఇది నిజం..!

 డాక్టర్ కటుకోఝ్వల రమేష్