15-12-2025 07:14:45 PM
* ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
* గెలుపుపై ఎవరికివారే ధీమా
అచ్చంపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన చివరి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, బల్మూర్, పదర, లింగాల, ఉప్పనుంతల, చారగొండ మండలాల్లోని గ్రామ పంచాయతీలకు మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాలలోని 410 గ్రామ పంచాయతీలలో సర్పంచులు, 1,048 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యధికంగా అచ్చంపేట మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు అత్యల్పంగా పదర మండలంలోని 8 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
అలాగే ఆయా మండలాల్లోని 15 గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యలను పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రాతనిధ్య వర్గం అభ్యర్థులు లేనందునా.. అమ్రాబాద్ మండలంలోని కుమ్మరోనిపల్లి, కల్మలోనిపల్లి, వంగురోనిపల్లి, లక్ష్మాపూర్ (బీకే), ప్రశాంత్ నగర్ గ్రామాల్లో సర్పంచు, 40 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. చారగొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
* వాగ్దానాలు.. వాగ్భాణాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే డా.గువ్వల బాలరాజు, ఇతర ముఖ్యనేతలు గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. తమ పార్టీ మద్దతు అభ్యర్థుల తరఫునా ప్రచారం నిర్వహించారు. తమదైన వాగ్దానాలు.. వాగ్భాణాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న.. గ్రామాల్లో ఎన్నికల కోలాహాలంతో సందడిగా మారాయి. ఎక్కడ చూసినా.. తమనే గెలిపించాలనే నినాదాలతో ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు లౌడ్ స్పీకర్లు మూగబోయాయి. అయినా అభ్యర్థులు గుట్టుగా ఇంటింటికి వెళ్లి ఓటరు దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నాలు కొనసాగించారు. ఆయా గ్రామాల్లో పోలీసులు నిఘా ఉంచారు. రాత్రివేళల్లో గస్తీ నిర్వహించి, ఎలాంటి ఆలజడులు జరగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకున్నారు.