13-09-2025 06:41:04 PM
10 టన్నుల యూరియా గంటలో ఖతం
జుక్కల్ (విజయక్రాంతి): యూరియా కోసం ఎదురుచూస్తున్న రైతులకు శనివారం జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ సొసైటీలో కొద్దిపాటి ఉపశమనం కలిగినట్లు అనిపించింది. శుక్రవారం వచ్చిన పది టన్నుల యూరియా శనివారం ఉదయం 10 గంటలకు పంపిణీ చేయగా రైతులు హార్ట్ కేకు లాగా ఎగబడి గంటలోపు తీసుకెళ్లిపోయారు. ఉదయం 8 గంటల నుంచి రైతులు క్యూ లైన్ లో నిలబడలేక పాస్ బుక్కులను పెట్టారు. రైతులు ఆందోళన చేస్తారేమోనని పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రైతులు ఈ విధంగా యూరియా బస్తాలను తీసుకోవడానికి ఎగబడ్డారు. కొందరు రైతులకు యూరియా సరిపోక వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈ విషయమై ఏఓ మహేశ్వరిని వివరణ కోరగా.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లా అధికారులకు మొత్తం 30 టన్నుల యూరియా అవసరమని ప్రతిపాదించినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం 10 టన్నులు పంపారని మరో 2 రోజుల్లో 20 టన్నుల యూరియా సొసైటీ కి వస్తాయని పేర్కొన్నారు. జుక్కల్ మండలంలో 2000 ఎకరాల్లో వరి పంట వేసినట్లు ఆమె చెప్పారు. సొసైటీ కార్యదర్శి బాబురావు దగ్గర ఉండి పర్యవేక్షించారు.