04-08-2025 12:28:01 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, ఆగస్టు 3 : ప్రజలు వ్యక్తిగత, శారీరక, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ నీరు నిలవ లేకుండా చూసుకున్నట్లయితే వ్యాధులు దరి చేరకుండా మంచి ఆరోగ్యం మన సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ దంపతులు సైకిల్ పై 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ అకస్మికంగా సందర్శించారు.
రోగులకు అందిస్తున్న సేవలు, సిబ్బంది హాజరు పట్టిక ఓపి రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, పరిశీలించి వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్య శాఖను బలోపేతం చేస్తూ పటిష్ట కార్యచరణ ద్వారా ముందుకు పోతుందని, దానికి అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని, జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలను పటిష్ట పర్యవేక్షణకు కలెక్టర్ కార్యాలయంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టమన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మలేరియా కేసులు నమోదు కాలేదని, తక్కువ మొత్తంలో నమోదైన డెంగ్యూ, ప్రమాద సాయి కేసులు ఎక్కడ లేవన్నారు.
ప్రజలను రక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల తక్కువ మొత్తంలో ప్రసవాలు జరుగుతున్నాయని గుర్తించడం జరిగిందని తొందర్లోనే గైనకాలజిస్ట్ పోస్టును నింపి అధిక మొత్తంలో ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యాధికారులు పాల్గొన్నారు.