calender_icon.png 14 September, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరుగుతున్న సింగరేణి ప్రాభవం!

14-09-2025 12:38:56 AM

తెలంగాణ కొంగు బంగారంగా పేరొందిన సింగరేణి మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. పాత గనులు మూసివేతకు చేరడం, కొత్త గనుల ఊసులేకపోవడంతో ఉపాధిదారులు సుకుపోతున్నాయి. కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన కార్మిక సంఘాలు.. పైరవీ కొరల్లో చిక్కుకొని కార్మిక హృదయాల నుంచి దూరమవుతున్నాయి. సింగరేణికి పునర్వైభవం తీసుకురావాల్సిన ఆవశ్యకతపై విజయక్రాంతి కథనం. 

తెలంగాణకు కొంగు బంగారం.. సకలజనులకు జీవగడ్డ సింగరేణి కరుగుతున్న కొవ్వొత్తిలా తరిగిపోతుంది. రోజురోజుకూ దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. సింగరేణి తిరోగమన స్థితితో యావత్ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి కార్మికుల పేరుతో వెలసిన సంఘాలు తమ పుట్టుక నేపథ్యానికి విరుద్ధంగా, తలకిందులుగా నడుచుకుంటున్నాయి. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారిన చందంగా కార్మిక సంఘాలు రంగులు మార్చుకుంటున్నాయి.

కార్మిక సేవే పరమావధిగా చెప్పుకుంటున్న సంఘాల అగ్ర నాయకులు స్వార్థపు కుంపట్లలో కూరుకున్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక కుటుంబాల సంక్షేమ పోరాటాలకు మొండిచేయి చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కార్మికుల హక్కులను తాకట్టుపెట్టి, కంపెనీ ఇచ్చే పైరవీలకు కక్కుర్తిపడి.. వారి పట్ల ప్రభుభక్తిని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఆగమ్య గోచరంలో సింగరేణి చిక్కిశల్యం అవుతుంది. ఈ క్రమంలో సింగరేణిలో కార్మిక సంఘాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. అయినప్పటికీ సంఘాల్లో చలనం లేకుండా పోతుంది. ఫలితంగా ట్రేడ్ యూనియన్లు కార్మికుల హృదయాల నుంచి దూరమవుతున్నాయి. నానాటికి కనుమరగవుతోన్న కార్మిక హక్కులను కాపాడటంలో కార్మిక సంఘాలు పూర్తిగా విఫలం చెందాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొత్తహక్కుల సాధన మాట అటుంచితే.. పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న హక్కుల పరిరక్షణ గాలికొదిలేశాయన్న అపవాదు మూటగట్టుకుంటు న్నారు. సింగరేణిలో ఉపాధి దారులు శరవేగంగా మూసుకుపోతున్నాయి. కొత్త గనుల ఊసేలేకుండా పోయింది. పాత గనులు మూసివేతకు చేరువలోఉన్నాయి. దీంతో సింగరేణిలో పారిశ్రామిక పట్టణాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. 

తగ్గుతున్న కార్మికుల సంఖ్య..

సింగరేణిలో లక్షా 16 వేలుగా ఉన్న కార్మికుల సంఖ్య 42 వేలకు పడిపోయింది. అదే విధంగా పదుల స్థాయిలో భూగర్భగనులు మూతబడుతున్నాయి. నూతనంగా ఒక్క బొగ్గు బావి కూడా ఇప్పటికీ కానరాలేదు. ఒకప్పుడు సింగరేణి అభివృద్ధి, సంక్షేమమే కంపెనీ విధానాలుగా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. బొగ్గు ఉత్పత్తి ఒక్కటే లక్ష్యంగా కంపెనీ పాలసీగా మారింది. అందుకే కొత్త బావులు, ఉత్పత్తి అవకాశాలు తగ్గిపోతున్నాయి.

ఈ పరిస్థితి ఇలాగే సాగితే మరో 20 ఏండ్లలో సింగరేణి బతికి బట్టగట్టడం కష్టమే అని స్వయనా కంపెనీ ప్రతినిధులే స్పష్టం చేస్తుండటం ఆందోళనకర అంశం. సింగరేణి కంపెనీ, కార్మిక జీవితాలు ప్రమాదపుటంచుకు చేరాయి. ఈ నేపథ్యంలో సింగరేణి పరిరక్షణ, కార్మికుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాల్సిన కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు గురుతర బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారు.

మనుగడపై నీలినీడలు..

సింగరేణి యాజమాన్యం నిర్వహణ తీరు సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం బొగ్గు ఉత్పత్తి చర్యలకే పరిమితమై, సంక్షేమ ఉపాధి రంగాలకు తిలోదకాలిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ఫలితంగా సింగరేణి మనుగడ క్రమేణా మసకబారుతుంది. రోజురోజుకు గనులు మూతబడి, కొత్త గనులు రాక సింగరేణి సంస్థ పురోగతికి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కడమెలా అన్నది సింగరేణి ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అస్తిత్వం కోల్పోతున్న పారిశ్రామిక పట్టణాలు..

బొగ్గు గనులతో అటవీ ప్రాంతాలు, ఉత్పత్తి, జీవనోపాధి కేంద్రాలుగా మారి ఆ తర్వాత పట్టణాలు పారిశ్రామికంగా రూపుదిద్దుకున్నాయి. తొలినాళ్ల అభివృద్ధి వెలుగు రేఖలతో విరాజిల్లిన కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి, రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి ఏరియాలు ప్రస్తుతం దివాలాతీస్తున్నాయి. చేయూత కరువై పారిశ్రామిక శోభను కోల్పోతున్నాయి.

సింగరేణికి సిరులు కురిపించిన జీవగడ్డలైనా బొగ్గుట్టల భవిష్యత్తు.. రానురానూ భరోసాను కోల్పోతున్నాయి. మొత్తంగా సింగరేణి పారిశ్రామిక సముదాయం ఎన్నడూ లేని తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితికి సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న అభివృద్ధి నిరోధక విధానాలే కారణమని  కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సింగరేణి మునగడకు సరికొత్త సంస్కరణలు తీసుకురావాల్సి ఉండగా, ఆ దిశగా యజమాన్యం సాగకపోవడం, సింగరేణి మనగడుగకు అవరోధంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బొగ్గు గనులు ఏర్పడటం..

ఆ తర్వాత మూతపడటం సర్వసాధారణమే. కానీ ఇదే క్రమంలో సింగరేణికి నూతన జవసత్వాల కల్పనకు కొత్త గనులు, ఉపాధి అవకాశాల మెరుగుదలపైనే కంపెనీ ప్రధాన దృష్టి ఉండాలి. కానీ ఇలాంటివేమీ యాజమాన్యం చేయడం లేదు. ఓ వైపు ఉత్పత్తి, మరోవైపు ఉపాధి కల్పనను సింగరేణి సమంగా నిర్వర్తించాలి. ఇవే సింగరేణి సంజీవనికి జీవకర్ర. ఈ సత్యం సింగరేణి యాజమాన్యానికీ తెలియంది కాదు. 

బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదక కోసమే ఓపెన్ కాస్ట్‌లను ప్రధాన వాహికగా ఎంచుకోవడం, భూగర్భ గనులను చరిత్రను విస్మరించడమే సింగరేణి తిరోగమనానికి, తాజా పరిస్థితికి ప్రధాన కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సరైన దిశగా సింగరేణి సాగాలి..

మునిగిన కొద్ది వీక్షించే పద్ధతులకు స్వస్తి పలికి సింగరేణి భవిష్యత్తు కోసం వాస్తవ పరిస్థితులను యజమాన్యం అర్థం చేసుకోవాలి. సంస్థ ప్రగతికి అనుగుణంగా యాజమాన్యం తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. బొగ్గు ఉత్పత్తి, కొత్త అండర్ గ్రౌండ్ గనులు సింగరేణికి పూర్వవైభవాన్ని తీసుకొస్తాయనే విషయాన్ని గుర్తించాలి.

అండర్ గ్రౌండ్‌లో నిక్షిప్తమై బొగ్గు నిక్షేపాల వెలికితీత ప్రగతి కాముకంగా జరగాలి. భూగర్భబొగ్గు గనులే సింగరేణి పుడమి తల్లికి గొడుగు పడతాయి. నేల విడిచి సాము చేసినట్టు భూగర్భగనులను వీడితే సింగరేణి బొగ్గు పరిశ్రమ భవిష్యత్తు అంధకారమే అవుతోందన్న కఠిన వాస్తవాన్ని విస్మరించజాలనిది. ఈ దృష్టి కోణాన్ని యజమాన్యం పాటించకపోతే కొంగు బంగారం నల్లనేలలో మిగిలేది ఎండమావేనని సింగరేణి శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు.

- బెల్లంపల్లి అర్బన్, సెప్టెంబర్