24-01-2026 12:08:50 AM
సంస్థాన్ నారాయణపూర్, జనవరి 23 :మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తెరవాలని,సిట్టింగ్ సాయంత్రం 6 గంటల తర్వాత మొదలు పెట్టాలని సూచించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిబంధనలు అమలు కావడం లేదు.గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వైన్ షాపులను మూసివేసి మధ్యాహ్నం తర్వాతనే తెరవాలని సూచించారు.వైన్స్ సిబ్బంది అభ్యంతరం చెప్పినప్పటికీ బలవంతంగా మూసివేయించారు.
రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందే అని తేల్చి చెప్పారు.కానీ శుక్రవారం ఎక్సైజ్ అధికారులు ఉదయమే వైన్స్ షాపులను, సిట్టింగులను తెరిపించారు.తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని మధ్యాహ్నం తర్వాత తెరవాలనే నిబంధన తమకు రాలేదని రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ అమలులో ఉందని తెలిపారు.బలవంతంగా ఎవరైనా మద్యం షాపులను మూసివేయిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలింగస్వామితో కలిసి వచ్చి వైన్స్ షాపును మూసివేయాలని చెప్పడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను అమలు చేయాల్సిందే అంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు.పోలీసుల పహారాలో ఎన్ని రోజులు మద్యం అమ్మకాలు నిర్వహిస్తారంటూ షాపు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో గంటపాటు వైన్స్ షాపుల భారీగా మోహరించిన నాయకులను పోలీసులు సర్ది చెప్పి గొడవలు జరగకుండా చూశారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రేపటినుండి మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతనే మద్యం దుకాణాలు తెరవాలని లేకపోతే జరిగే పరిణామాలకు యజమానులు బాధ్యత వహించాలని హెచ్చరించారు.