29-09-2025 12:00:00 AM
నల్లగొండ, సెప్టెంబర్ 28(విజయక్రాంతి) : మూసీ నది నిండుకుండలా మారింది. హైదరాబాద్ మహానగరంతో పాటు మూసీ నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో మూసీ ఉప్పొంగింది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు యాదాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వరద నీరు పొటెత్తింది. మూసీ నది వెంట ఉన్న పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
మూసీ నదికి భారీగా వరద పోటెత్తడంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు మూసీ ప్రాజెక్టుకు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తారనే సమాచారం తెలియడంతో సందర్శకులు భారీగా ప్రాజెక్టు వద్దకు తరలివచ్చారు. ఇదిలావుంటే.. ఈ సీజనులో వరుసగా మూసీ ప్రాజెక్టు గేట్లు తెరవడం గమనార్హం.
ప్రాజెక్టు ఆరు గేట్లు ఓపెన్..
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో మూసీ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులుకాగా, ప్రస్తుతం 642.70 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి 14 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తుండగా, అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 12వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
దీంతో మూసీనది పరివాహాక ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూసీ నదిలో ఎవ్వరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇదిలావుంటే.. మూసీ నది ఎగువ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నదీతీరం వెంట పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల ఉధృతిని అంచనా వేయలేక కొంతమంది నీటిలోనూ గల్లంతయ్యారు.
ఏండ్ల నుంచి మూసీపై నిర్లక్ష్యమే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి మూసీ ప్రాజెక్టుపై ఎడతెగని నిర్లక్ష్యం ఉంటోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ మూసీని చీకట్లు వీడడం లేదు. కొంతమేర నిధులు కేటాయించినప్పటికీ పెద్దగా చెప్పుకునే పరిస్థితుల్లో లేవనే చెప్పాలి. ప్రాజెక్టు వద్ద పర్యాటకంగా తీర్చిదిద్దితే.. నాగార్జునసాగర్ తర్వాత అంతటి పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుంది. కానీ ప్రాజెక్టు నిర్వహణ నిధులకే అతీగతీ లేదు. ఇక పర్యాటకం సంగతి దేవుడికే తెలియాలి.
దాదాపు రెండేండ్ల క్రితం ప్రారంభించిన మూసీ కాల్వల సీసీ లైనింగ్ పనులు ఇప్పటికీ అతిగతీ లేవంటే అతిశయోక్తి కాదు. ప్రాజెక్టు గేట్లు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం లేదు. సూర్యాపేట పట్టణానికి మంచినీటిని అందించే నీటిశుద్ధి కేంద్రంపైన నీలినీడలు కమ్ముకున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద ప్రాజెక్టు అయిన మూసీ నది మురికి వదిలించడంలో పాలకులు చిత్తశుద్ధి చూపడం లేదు.
వెలవెలబోతున్న పర్యాటకం..
మూసీ ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దితే నెలల వ్యవధిలోనే ఊహించని అభివృద్ది కన్పిస్తోంది. చుట్టూ ఎత్తున గుట్టలు.. మరోవైపు గంగమ్మ సవ్వడులు, ప్రకృతి పచ్చదనం కనులవిందు చేస్తుంది. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు వద్దకు చేరుకునేందుకు కనీసం రహదారి సౌకర్యం లేదు. కనీసం పర్యాటకులు గొంతు తడుపుకునేందుకు చుక్క తాగునీరు దొరకదు.
మూసీ ప్రాజెక్టుకు అనుబంధంగా గెస్ట్హౌజ్ను నిర్మించినా.. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వల్ల అదికాస్త శిథిలావస్థకు చేరుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గొప్ప నేతలు ఉన్నా.. వారంతా మూసీ ప్రాజెక్టుపై శీతకన్ను వేయడం గమనార్హం. ఇప్పటికైనా ఉద్దండ నేతలు స్పందించి మూసీ ప్రాజెక్టుపై కమ్ముకున్న చీకట్లను తరిమేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.