26-09-2025 12:58:12 AM
అక్కన్నపేట మండలంలో ఇబ్బందులు పోగొడుతం
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు బుక్స్ పంపిణీ
హుస్నాబాద్, సెప్టెంబర్ 26 :హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎంపీడీవో ఆఫీసుకు శంకుస్థాపన చేసిన ఆయన, ఎంపీడీవో కార్యాలయం పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు.
మండల స్థాయి ఆఫీసులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ఎంపీడీవో కార్యాలయం నిర్మాణం ద్వారా ఆ సమస్యలు తొలగుతాయన్నారు. తహశీల్దార్ కార్యాలయానికి కూడా భవనం లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే ఆ ఆఫీసును కూడా నిర్మిస్తాం అని భరోసా ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం,
గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అనంతరం ఆయన హుస్నాబాద్లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమకూర్చిన పుస్తకాలు, కాలిక్యులేటర్లు తదితర విద్యాసామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల బాధ్యత మాది.
చదివి విజయాలు సాధించడం మీ బాధ్యత అని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కాలేజీకి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. అనంతరం మంత్రి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు యూనిఫామ్ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్, ఆర్డీవో రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.