25-12-2025 12:56:12 AM
హంతకులను పట్టుకోకుంటే నీకు పరారీనే శరణ్యం
హాదీ సోదరుడు ఒమర్ హెచ్చరికలు
నానాటికీ దిగజారుతున్న బంగ్లాదేశ్ పరిస్థితులు
ఢాకా, డిసెంబర్ 24: బంగ్లా ఉస్మాన్ హాదీ హత్యలో ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ను చిక్కుల్లో పడేస్తున్నా యి. అదే సమయంలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం కూడా యూనస్ సర్కారుకు ఇబ్బంది పెడుతోంది. మొత్తం మీద రాజకీయ అల్లర్లతో బంగ్లాదేశ్‌లో నానాటికీ పరిస్థి తులు మరింత దిగజారుతున్నాయి.
ప్రభుత్వమే హాదీని చంపేసింది!
ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై హాదీ సోదరుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. హాదీ హత్యలో యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు ఆరో పించారు. ‘ఉస్మాన్ హాదీని మీరే(యూనస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) చంపేశారు.
ఈ ఘటనను ఉపయోగించుకుని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు రద్దు చేయాలని చూ స్తున్నారు. నా సోదరుడి హత్యపై వేగంగా దర్యాప్తు చేసి, హంతకులను పట్టుకోవాలి. హాదీకి న్యాయం జరగకపోతే.. మీరు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్‌ను వీడి పారిపోవాల్సి వస్తుంది జాగ్రత్త? అని ఉస్మాన్ హాదీ సోదరుడు ఒమర్ హెచ్చరించారు.
యూఎస్‌లో ఆందోళన
మాజీ ప్రధాని షేక్ హాసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో 2026లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లే కుండా పోయింది. దీనిపై కొంతమంది అమెరికా సెనేటర్లు పలు రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. పారదర్శకత, స్వేచ్ఛాయుత విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు బంగ్లాదేశ్ పౌరులకు ఉందని వారు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలు నిర్వహించేలా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అవామీ లీగ్‌పై నిషేధాన్ని ఎత్తేసేందుకు పరిశీలించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ చీఫ్‌ను తొలగించాలని డిమాండ్
ఢాకాలోని గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ కార్యాలయాన్ని ముట్టడించిన అనేక మంది యువకులు దాని వార్తా విభాగ అధిపతి నజ్నిన్ మున్నీని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రముఖ టీవీ యాంకర్ అయిన నజ్నిన్ అవామీ లీగ్ మద్దతుదారని యువకులు ఆరోపించారు. ‘వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం, నగర యూనిట్ పేరుతో దాదాపు 7-8 మంది నా కార్యాలయానికి వచ్చి, నేను నా ఉద్యోగాన్ని వదులుకోకపోతే, ప్రోథోమ్ అలో, ది డైలీ స్టార్ లాగా నా కార్యాలయానికి నిప్పంటిస్తామని బెదిరించారు’ అని నజ్నిన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
సంఘటన జరిగినప్పుడు తాను కార్యాలయంలో లేనని చెప్పారు. ఆ యువత మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిశారని ఆమె చెప్పారు. ఆ సంస్థ అధ్యక్షుడు రిఫత్ రషీద్ మాట్లాడుతూ, సభ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయినా వినని యువకులు 48 గంటల్లో ఆమెను తొలగించకపోతే కార్యాలయానికి నిప్పు పెడతామని హెచ్చరించి వెళ్లిపోయారు.
బంగ్లాదేశ్‌లో మరొకరి మృతి
బంగ్లాదేశ్ రాజధాని మోగ్‌బజార్‌లో బుధవారం స్వాతంత్య్ర సమరయోధుల స్మారకం ముందు ఓ ఫ్లైఓవర్ నుంచి ఒక గుంపు ముడి పేలుడు పదార్థాన్ని విసరగా.. అది పేలి ఒకరు మృతిచెందారు.