25-12-2025 01:16:44 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఉన్నావ్ బాధితుకులకు న్యాయం జరిగేలా అన్ని విధా లుగా కృషి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉన్నావ్ అత్యాచార కేసు బాధితురాలు, ఆమె తల్లి బుధవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిశారు. ఇంతకుముందు కొన్ని గంటల ముందే కేంద్ర పారామిలిటరీ సిబ్బంది ఆ వృద్ధురాలిపై దురుసుగా ప్రవర్తించారు. రాహుల్ గాంధీ జర్మనీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఒక రోజు తర్వాత, సోనియా గాంధీ నివాసమైన 10 జన్‌పథ్ రోడ్‌లో బాధితురాలి, ఆమె తల్లి రాహుల్ గాంధీని బుధవారం కలిశారు.
గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ కేసును ఉన్నత స్థాయికి తీసుకువెళ్తామని, న్యాయం జరిగేలా చూస్తామని రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ కుటుంబానికి సాధ్యమైన అన్ని విధాలా సహాయం అందిస్తామని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నాయి. రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో, తనకు సుప్రీంకోర్టుపై పూర్తి నమ్మకం ఉందని బాధితురాలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి కూడా విజ్ఞప్తి చేశారు. మోదీని కలుస్తామని పేర్కొన్నారు.