30-08-2025 12:00:00 AM
-కన్నీరు పెడుతున్న కామారెడ్డి వరద ముంపు బాధితులు
-కట్టు బట్టలే మిగిలాయి.. ప్రాణాలు కాపాడుకున్నాం..
-వరద బాధితుల కన్నీటి వ్యధలు, అరగంటలో పట్టణాన్ని చుట్టుముట్టిన భారీ వరదలు
-అధికార యంత్రాంగం ముందుగా హెచ్చరిస్తే జాగ్రత్త పడేవాళ్లం
-ఇల్లు తెరిచి చూస్తే మోకాలి లోతు బురద
-ఇంటిలోని సామగ్రి అంతా బురదమయం
-ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని
-కోరుతున్న బాధితులు
కామారెడ్డి, ఆగస్టు 29 ( విజయ క్రాంతి ), కామారెడ్డి జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలకు వరద తాకిడికి గురై ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్లిన బాధితులు నాలుగు రోజులకు తమ ఇండ్ల వద్దకు వచ్చి చూస్తే ఇంటిలో మోకాలు లోతు బురద, ఇంటిలోని సామగ్రియంత బురదలో కామారెడ్డి లోని జి ఆర్ కాలనీ వాసులు శుక్రవారం తమ ఇండ్లు వద్దకు చేరుకొని గూడు చెదిరి కూడు కరువై గృహాలు నీట మునిగి మట్టి దిబ్బలు వ్యర్థ పదార్థాలు ఇండ్లలో చేరి నా దృశ్యాలను చూసి చలించి పోయారు.
లోని వస్తువులు బురద మయమై ప్రాణం మిగిలిందే తప్ప ఇంట్లో దాచుకున్న సామాగ్రి బురదమయమైందని వరద బాధితులు కన్నీరు మున్నీరుగా చెబుతున్నారు. వంట సామాగ్రి ఏ ఒక్కటి ఉపయోగపడదని నిత్యవసర వస్తువులు నీట మునిగి చెడిపోయాయని ఆర్థిక పరిస్థితులు అగమ్య గోచరమై రోదననే మిగిలిందని వరద బాధితుల ఆక్రందన ఆవేదన వినే వారికి కంటనీరు తెప్పిస్తున్నాయి. చాలీచాలని జీతాలు బ్రతుకు బండి నడుపుకో వడానికి రెక్క ఆడితేకానీ డొక్కరిని మధ్యతరగతి కుటుంబాల ఆవేదన ఇది. ఇల్లు ఉందని పేరు తప్ప దానిపై బ్యాంకుల్లో అప్పులు తాము యధాస్థితికి రావడానికి మరో పదేళ్లు పడుతుందని జి ఆర్ కాలనీ వాసుల ఆక్రందన.
ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించ కుంటే మా కుటుంబాల పరిస్థితులు దుర్భరంగా మారే స్థితి దాపురించిందని మహిళలు కుటుంబ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి రోజు పండుగ వాతావరణం లో ఉన్న ఇండ్లు ఒక్కసారిగా వచ్చిన వరదలు ఊహించని షాకుకు గురై కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జి.ఆర్, హౌసింగ్ బోర్డ్, కౌండిన్య ఎన్క్లేవ్, బతుకమ్మ కుంట, విద్యానగర్, దేవి విహార్ కాలనీలో ని వారి పరిస్థితి ఊహించని విధంగా వరదల బీభత్సాహానికి గురైనట్లు బాధితులు శుక్రవారం తమ ఇండ్ల వద్దకు వచ్చి బోరున విలపిస్తూ తమ గోడును వెలబుచ్చారు. అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని బాధితులు వాపోయారు.
ప్రభుత్వం తమ బాధను గుర్తించి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఒక్కొక్క రీ పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంది. తమకు గత ఏడాది వరదలు వచ్చినప్పుడు అధికారులకు చెప్పాము. పట్టించుకోలేదు. ఈసారి మరింత ఎక్కువగా వరదలు30 నిమిషాల్లోనే చుట్టుముట్టయి. ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో బంగ్లా పైకి ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నామని ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో బాధితులు తెలిపారు. కామారెడ్డి పెద్ద చెరువు పొంగి పొర్లడంతో వరద ఉధృతి పెరిగి సమీపంలో ఉన్న జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, కౌండిన్య ఎంక్లేవ్ లో నివసిస్తున్న 500 కుటుంబాలు వరద తాకిడికి చిక్కుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ఇళ్లలో ఉన్న చిత్తు కాగితం తోపాటు అన్ని వస్తువులు చిక్కుకొని పాడైపోయాయి.
టీవీలు ఫ్యాన్లు, ఫ్రిజ్లు, కూలర్లు, బైకులు, బెడ్లు, అన్ని ఇంట్లో ఉన్న వస్తువులు పాడైపోయాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నామని బాధితులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు వచ్చి ఇండ్లలో బురదమయం గా ఉన్న ఇండ్లలో నీటి ద్వారా శుభ్రం చేయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా బాధితులకు తాగునీరు, పులిహోర ప్యాకెట్లు అందజేశారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూరులో గుంతలు పడిన రోడ్లను జిల్లా కలెక్టర్ అసిస్ సంఘవన్ పరిశీలించారు. తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి మండలంలోని పోచారం ప్రాజెక్టు గుంత పడి ప్రాజెక్టుకు ప్రమాదం ఉండడంతో ఎన్ డిఆర్ ఎస్ బలగాలతో గండిని ఇసుక సంచులతో పూడ్చారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద వరద తాకిడికి ముంపు కు గురైన గ్రామాల ప్రజలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేశారు. వారికి మనోధైర్యాన్ని కల్పించారు. వరద ఉధృతి తగ్గడంతో రాకపోకల అంతరాయం తొలగింది.
జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, డోంగ్లి మండలాల పరిధిలోని పలు గ్రామాలు వరద ఉధృతికి చిక్కుకున్న గ్రామాల ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించిన అధికారులు వారికి భోజన ఏర్పాట్లు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూరు, నస్రుల్లాబాద్ లలో వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి వారి నీ ఓదార్చారు. సమస్యలను తెలుసుకున్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్ మండలాలలోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఎలాంటి ఆందోళనకు గురికా వద్దని భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరద తాకిడికి పంటలు నీట మునిగిన విషయాన్ని రైతులు, గ్రామస్తులు, బాధితులు ఎమ్మెల్యేలకు విన్నవించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
భారీ వాహనాల దారి మళ్లింపు
అర్మూర్, ఆగస్టు 29 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 44వ జాతీయ రహదారి దెబ్బతినడంతో అర్మూర్ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్ళించినట్లు ఆర్మూర్ సిఐ సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ కు వాహనాలను మళ్లిస్తున్నట్లు తెలిపారు. కామరెడ్డి నుంచి బిక్కనూర్ మధ్య తెగిపోయి రహదారి మరమ్మత్తులు జరుగుతున్న దృష్ట్యా వాహనదారులు, ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వ్యక్తిగత వాహనాలకు ఆర్టీసీ బస్సులకు అనుమతి ఉందని ఆయన పేర్కొన్నారు.
వరద బాధితులకు భరోసా నిచ్చిన ఎస్పీ రాజేష్ చంద్ర..
నిజాంసాగర్ ఆగష్టు 29( విజయ క్రాంతి ) ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో వరద గేట్ల ద్వారా భారీ మొత్తంలో నీటి విడుదల చేశారు. వరద నీటిలో ముంపుకు గురవుతుందని ఉద్దేశంతో నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ పంచా యతీ పరిధిలోని మర్పల్లి గ్రామస్తులను అచ్చంపేట సహకార సంఘ ఫంక్షన్ హాల్ లో వసతి కల్పించారు. శుక్రవార కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వారికి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు,నీళ్ల బాటిల్లను అందించి ఎవరు కూడా అధైర్య పడద్దని బాధితులకు భరోసాని చ్చారు. ఆయన వెంట బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, రూరల్ సీఐ తిరుపతయ్య, నిజాంసాగర్ ఎస్త్స్ర శివకుమార్ తదితరులు ఉన్నారు.
భారీ వర్షంతో ముంపున గురైన గ్రామాల సందర్శన
నిజామాబాద్ ఆగస్టు 29: (విజయ క్రాంతి) : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు వరద వరద తాకిడి ఉదృతం కావడంతో ముంపుకు గురైన ప్రాంతాలతో పాటు రహదారులకు గ్రామాలకు సహాయక చర్యలు ముమ్మరం చేశామని జిల్లా కలెక్టర్ టి వినే కృష్ణారెడ్డి తెలిపారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న హంగర్గ కోపర్గా ఖాజాపూర్ సాలూర గ్రామాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. వరద తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అధికా రులకుకీలక ఆదేశాలు జారీ చేశారు.
గాంధారి మండలంలో 2523 ఎకరాలు పంట నష్టం
గాంధారి ఆగస్టు 29( విజయ క్రాంతి): గాంధారి మండలంలో గత మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలపై పకృతి కన్నెర చేసిందని చెప్పవచ్చు.. ఈ వర్షాలకు దాదాపు మండలంలో 33 గ్రామాలలో పంట నష్టం వాటిలినట్టు గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగం అన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధారి మండలంలో 33 గ్రామాలలో వరి మొక్కజొన్న సోయపంట పత్తి తో పాటు ఇతర అంతర పంటలు నీటి మునిగాయని సుమారుగా ప్రాధమిక అంచనా ప్రకారం 1986 రైతులకు సంబంధించి 2523 ఎకరాలలో పంటలు నీట మునిగి నష్టం వాటిలినట్టు తెలిపారు. సుమారుగా ఎక్కువ మొత్తంలో 1352 ఎకరాలలో వరి పంట నష్టం వాటిళ్ళి నట్టు ఆయన తెలిపారు.
గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం కూలిన నివాస గృహాలను పరిశీలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు మాట్లాడారు.ధ్వంసమైన ఇండ్లను స్థానంలో బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. బెజగం సంతోష్. ఏఎంసీ డైరెక్టర్ బొమ్మని బాలయ్య,ఎండ్రల్ గోపాల్. గంగి రామకృష్ణ. చిరుకురు రవి ఉన్నారు.
తాడ్వాయిలో..
- తాడ్వాయి, ఆగష్టు, 29( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఖరీఫ్ లో వేసుకున్న పంటలు నీట మునిగాయి. రైతులు ఒక్కో ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. తీవ్రమైన వర్షపాతం తో కొన్ని పంటలు కొట్టుకుపోగా, చాలా పంటలు నీట మునిగి తెలీ యా డుతున్నాయి. తాడ్వాయి మండలంలో ప్రధానంగా మొక్కజొన్న, వరి,పత్తి పంటలు రైతులు సాగు చేశారు. వేల ఎకరాలలో ఉన్న మొక్కజొన్న పంట, పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం సర్వేహించి సదరు రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
పంటల పరిశీలన
రాజంపేట, ఆగస్టు 29 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలను శుక్రవారం వేసే అధికారులు పరిశీలించారు. రాజంపేట మండలంలోని అరగొండ, అన్నారం తండా, బస్వన్నపల్లి గ్రామాలలో పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిణి శృతి, ఏఈఓలు అఖిల, సవిత ఉన్నారు.
అవుసుల కుంట, సొమారంతండాకు రాకపోకలు బంద్
గాంధారి ఆగస్టు 29 (విజయ క్రాంతి): గత రెండు రోజులు నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కార ణంగా అవుసుల కుంట సోమారం తండా మధ్యలో బ్రిడ్జి తెగిపోయింది. విషయం స్థానిక ప్రజలతో తెలుసుకొని సంఘటన స్థలాన్ని గాంధారి ఎస్త్స్ర ఆంజనేయులు సందర్శించి గాంధారి మండల ఉన్నతా ధికారులకు తెలియజేశారు. సాధ్యమైనంత త్వరలో రోడ్డును బాగు చేయాలని అధికారులకు సూచించారు.ఎస్త్స్ర వెంట ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గాం ధారి మండల అధ్యక్షుడు బొట్టు మోతిరం, తాండ ప్రజలు ఉన్నారు.
జీఆర్ కాలనీని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, ఆగస్టు 29 (విజయ క్రాంతి), జీ ఆర్ కాలనీలో కలెక్టర్ ఆశిష్ సంఘూ వన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ రెవిన్ ఇన్స్పెక్టర్ రవిగోపాల్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సిబ్బంది జి ఆర్ కాలనీ ప్రజలకు సహాయం అందించారు. రెండు రోజులపాటు కొనసాగిస్తేనే జి ఆర్ కాలనీలోని ఉరువాలు క్లీన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వరద బీభత్సంతో అతలాకుతలమైన కామారెడ్డి జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, కౌండిన్య వరద వచ్చి ప్రజలు ఇబ్బంది పడ్డారు. బాధితులకు టిఫిన్ సౌకర్యం కల్పించడంతోపాటు భోజన వసతి కూడా కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు ఆధ్వర్యంలో జి ఆర్ కాలనీలో పాల్గొని సేవలందించారు. ఇళ్లలోని వస్తువులను బయటకు తీసి పెట్టారు. బాధితులకు అండగా నిలిచారు.
నిరాశ్రయులకు వైద్యసేవలు
నిజామాబాద్ ఆగస్టు 29 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగర శివారులోని బూర్గంపి గ్రామంలో వైద్యశాఖ సిబ్బంది గ్రామంలోని నిరుపేద కాలనీ లలో వైద్య సేవలు అందించారు. బోర్గం కాలువ నీరు ఉదృతంగా పారడంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలకు తడుస్తూ ఉన్న వృద్ధులకు పిల్లలకు విష జ్వరాలు సోకకుండా ప్రాథమిక వైద్య చికిత్సలు అందించారు మోపాల్ మండల గ్రామం బోర్గాం పి ఐదవ డివిజన్ లోని పీహెచ్ సి ముదక్ పల్లి సబ్ సెంటర్ బోర్గాం పి డాక్టర్ సంతోష్ తోపాటు వారి సిబ్బంది ఏఎన్‌ఎం లతా శ్రీరామ్ ,అనురాధ ,ఆశ వర్కర్ సరోజ వృద్ధులకి, చిన్నపిల్లలకి ప్రాథమిక చికిత్స చేసి మందులను ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
కొట్టుకుపోయిన పోచారం ప్రాజెక్టు దిగివ వంతెన
ఎల్లారెడ్డి ఆగస్టు 29 (విజయకాంతి): భారీగా వచ్చిన వరదకు పోచారం ప్రాజెక్టు నుండి 1,65 వేల క్యూసెక్కుల భారీ వరద రావడంతో పోచారం ప్రాజెక్టు దిగవన ఉన్న మెదక్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వంతెన మెదక్ కామారెడ్డి జిల్లాలకు వంతెనగా ఉన్న పులుగు రెండు వైపులా మట్టి కొట్టుక పోవడంతో, శుక్రవారం వరద తగ్గడంతో అత్యవసర పరిస్థితుల్లో కొందరిని పారా మిలిటరీ సిబ్బంది సహాయంతో రెస్క్యూటివ్ అవతలి గట్టుకు తరలించారు. వరద నేపథ్యంలో పోలీసులు ధైర్యం కల్పించారు.