03-11-2025 01:41:58 AM
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీలోకి వెల్లువెత్తుతు న్న చేరికలతో అందరికీ మెసేజ్ పోతోందని, ఇక వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వంద రోజుల్లో ఇస్తానన్న హామీలు 700 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చట్లేదన్నారు. ఆడబ్డి కన్నీళ్లనూ విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్‌లో బుద్ధిచెప్పాలని కేటీఆర్ ఓటర్లను కోరారు. ఆదివారం చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి బీజేపీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రెండేళ్లలో రాష్ర్టం ఎలా అయ్యిందో అందరూ ఆలోచించాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ నాశనమైందని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ బంద్ అయాయని, కొత్త కార్యక్రమాలు లేకపోగా.. ఉన్నయి కూడా పోయాయని ఎద్దేవా చేశారు. పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అని అందరూ చెబుతున్నారని, మరో 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. గోపీనాథ్‌ను తలుచుకొని సునీత కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని కూడా కాంగ్రెస్ విమర్శిస్తోందని, ఒక ఆడబిడ్డకు ఆమె భర్త చనిపోతే ఏడుపు రాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతల ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్లు ఏడ్వరా, చనిపోయిన వారిని తలుచుకొని ఏడిస్తే కూడా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఓటర్లకు సూచించారు. దేవుళ్ల మీద కూడా ఒట్టేసి కాంగ్రెస్ నేతలు మాట తప్పారని మండిపడ్డారు. మహిళలకు రూ.4000, యువతులకు రూ.2500, తులం బంగారం వంటి అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తే.. ‘నన్నెవ్వరూ నమ్మట్లేదు. ఢిల్లీకి పోతే నన్ను దొంగలా చూస్తున్నారు’ అని అంటున్నారని, మరి దొంగను దొంగలాగానే కదా చూస్తారని ఎద్దేవా చేశారు.
అప్పు తీసుకుంటే కూడా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. వంద రోజుల్లో ఇస్తానన్న హామీలు 700 రోజులైనా కాంగ్రెస్ నెరవేర్చట్లేదని విమర్శించారు. వృద్ధులు, నిరుద్యోగులు, మహిళలు, యువతులు అందరూ హామీల గురించి అడుగుతున్నారని అన్నారు. చేతకాకపోతే.. అధికారంలోకి రావడానికి అడ్డమైన హామీలు ఇచ్చామని, ఇక తమతో కావట్లేదని రేవంత్ రెడ్డి పక్కకు కూర్చోవాలని సూచించారు. కరోనా సమయంలో రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏ ఒక్క పథకాన్నీ ఆపలేదని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని నడిపేవాళ్లకు తెలివి ఉంటే అలా ఉంటదని, తెలివి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలాగా ఉంటుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులకు మూటల గురించి తప్ప.. ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన లేదన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభివృద్ధి కోసమో, ప్రజల కోసమో పార్టీ మారలేదని, 11 ఎకరాల భూ కబ్జాను కాపాడుకునేందుకే ఆయన కాంగ్రెస్‌లో చేరారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను నాశనం చేయడం తప్ప.. రేవంత్ చేసింది ఏమీ లేదని, జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం- పలకాలని, ఆ పార్టీ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు. మైనార్టీ డిక్లరేషన్ అని రూ.4వేల కోట్ల బడ్జెట్ హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమేనని, జూబ్లీహిల్స్‌లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.