26-10-2025 12:33:18 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాం తి): యూపీఎస్ వద్దంటూ, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంఓపీఎస్) ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభను నవంబర్ 25న నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎంఓపిఎస్ సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ తెలిపారు. యూపీఎస్ అనేది ఒక విఫల పథకం అని, అందులో చేరడానికి తేదీని మూడు సార్లు కేంద్రం పొడిగించిందని, మూడు సార్లు సవరించినా కేవలం 3 నుండి 4 శాతం ఉద్యోగులు మాత్రమే దాన్ని ఎంచుకున్నారన్నారు.
ఢిల్లీలో నిర్వహించే ఈ భారీ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ర్ట ప్రభుత్వాల ఉద్యోగ ఉపాధ్యాయులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, ఆర్డినన్స్ మొదలైన శాఖల ఉద్యోగులందరూ భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షపై రివ్యూ చేయాలని, ఆర్టీఈ చట్టాన్ని సవరించాలన్న డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.