calender_icon.png 13 October, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవయిత్రుల అక్షరాస్త్రం ‘నానీ’

13-10-2025 12:11:31 AM

అతను గొప్పదానశీలి వృద్ధాశ్రమానికి అమ్మానాన్నల్ని దానం చేశాడు !

 కొప్పరి పుష్పాదేవి

మా ఊరు జనారణ్యం పులులసలే లేవు వాటి తాతలున్నాయ్!

 పోగుల విజయశ్రీ

గోరింటాకు ఆడపిల్ల అరచేతిలో పండాలి కళ్లలో కాదు !

 రంగనాయకి

వివాహమా ఎంతపని చేశావు? నన్ను పుట్టింటికి అతిథిని చేశావు..

 సి.భవానీదేవి 

..ఇలా ఎందరో కవయిత్రులు నానీ ప్రక్రియ ద్వారా తమ భావాలను వ్యక్తీకరించారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను, సమస్యలను కవిత్వీకరించారు. తద్వారా నానీ ప్రక్రియకు వన్నె తీసుకొచ్చారు. సాధారణంగా ‘కవిత్వం’ అనేది లోతైన సాహి త్య ప్రక్రియ. అత్యల్ప పదాల్లో అనల్ప భావాలను వ్యక్తీకరించే సృజన. కవిత్వ కవుల అనుభవాలు, ఊహలు, భావోద్వేగాల సమ్మేళనం. అయితే..

కొందరు కవులు దీర్ఘమైన వాక్యాలు రాస్తూ తమ విశాల భావజాలాన్ని వ్యక్తీక రిస్తారు. మరికొందరు కేవలం నాలుగు పాదాల్లోనే లోతైన భావాన్ని ప్రతిబింబిస్తారు. ఆ చిన్ని రూపంలో గొప్పభావాన్ని వ్యక్తీకరించే కవితా ప్రక్రియే ‘నానీ’. సంక్షిప్తత దీని ప్రాథమికత. పదాల విన్యాసం, భావ గాం భీర్యం, వాక్యసంపదతో ‘నానీ’ అనే ప్రక్రియ తెలుగు సా హిత్య రంగంలో వెలుగొందుతున్నది.

జపాన్‌లో హైకూ లు, టాంకాలు ఉన్నట్లు, తెలుగులో ‘నానీ’ ప్రక్రియ స్వతంత్రంగా ఎదిగింది. ఈ ప్రక్రియ విస్తరణకు తెలుగు నాట ఎందరో కవయిత్రులు నడుంబిగించారు. స్త్రీల మనసుల్లోని సున్నితత్వాన్ని, దైనందిన జీవితపు సత్యాలను, ప్రేమ, విరహం, సమస్యల ఇతివృత్తాలు, ప్రతీకలు తీసుకుని అద్భుతమైన నానీల సంపుటాలు వెలువరించారు. స్త్రీ భావప్రపంచానికి నానీ సహజమైన వేదికగా మారిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

నానీ కవిత్వంలో ప్రధానంగా నాలుగు శిల్ప లక్షణాలు కనిపి స్తాయి. అవి సంక్షిప్తత, ప్రతీక వైభవం, అలంకార వైవి ధ్యం, సాంద్రత. నానీ కవిత్వం కేవలం రూప ప్రయోగం కాదు.. భావకేంద్రీకృత వ్యక్తీకరణకు సరికొత్త దిశ.  ప్రక్రియలో కవయిత్రులు స్త్రీ జీవనానుభూతులు, ప్రకృతి సౌందర్యం, అంతరంగ భావాలను ప్రతిబింబించారు. తద్వారా సాహిత్యానికి ‘నానీ’ ప్రత్యేకతను తీసుకొచ్చారు.

నానీ స్థిరపడటంలో వారి పాత్ర విశేషమైనది. ఒక సాధారణ స్త్రీ కవిత్వం ప్రేమ, కుటుంబ, తల్లికూతుళ్ల సంబం ధాలకే పరిమితం అవుతుందని కొందరు భావించినా, కవయిత్రుల అంతకు మించిన వస్తువు, శిల్పంతో నానీలు రాశారు. 

డాక్టర్ ఎన్.గోపి ఆద్యుడు

కవయిత్రి చిల్లర భవానీదేవి తెలుగు సాహిత్య రంగం లో నానీలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. నానీ ప్రక్రియను భుజానికెత్తుకుని ఇతర కవయిత్రులకూ ఆమె ఆదర్శంగా నిలిచారు. కేవలం నాలుగు పాదాల్లో, 20 25 అక్షరాల పరిధిలో సంపూర్ణ భావవ్యక్తీకరించగలిగే నేర్పు నానీ కవులది. నిర్దిష్టమైన అక్షరనియమం లేకపోయినా, చివరి పాదంలో వచ్చే పదాలతో ఆ నానీ ప్రత్యే కతను పొందుతుంది.

 నానీ ప్రక్రియను తొలిసారిగా సృష్టించిన కవి డాక్టర్ ఎన్.గోపి. ఆయన నానీలు 1997 లో ఒక దినపత్రికలో వరుసగా ప్రచురితమయ్యేవి. 1998లో డాక్టర్ ఎన్.గోపి వాటిని నానీల పేరుతో పుస్తకరూపంలో వెలువరించారు. వచన కవిత్వంలో నూతన రూపకల్పనగా ఆవిర్భవించిన ఈ చిట్టి కవితా ప్రక్రియ అనేక మందిలో ‘నేనూ కవిత్వం రాయగలను’ అనే విశ్వాసాన్ని పెంపొందించింది.

ఆ సంపుటి వెలువడిన కాలం లో తెలుగు సాహిత్యంలో కవయిత్రుల సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, నానీ రూపం వారికి కొత్త దారిని చూపించింది. తద్వారా సాహితీరంగంలో వారికి దోవ దొరికింది. కవిత్వం చిన్నదైనా చమత్కారం, భావగర్భితంగా సాగే ఈ ప్రక్రియ ఎందరో మహిళలను ఆకర్షించింది.

అప్పటివరకు వచన కవిత్వంలోకి ప్రవేశించని అనేకమంది కవయిత్రులు నానీ ప్రక్రియలో కవిత్వం రాయ డం ప్రారంభించారు. క్రమంగా గంభీరమైన వచన కవి త్వం రాస్తూ వాసికెక్కారు. కాబట్టి.. నానీ ప్రక్రియ చిన్న కవితా ప్రక్రియేం కాదు. స్త్రీ సృజనాత్మకతకు ద్వారం తెరిచిన సాహిత్య విప్లవమని చెప్పవచ్చు.

ఎందరో కవయిత్రులు

భవానీదేవి ‘భవానీ నానీలు’, ‘హైదరాబాద్ నానీలు’ అనే నానీల సంపుటాలను వెలువరించారు. కవయిత్రి యశశ్రీ రంగనాయకి 2002లో ‘సూరీడి చెంపలు’ సంపుటిలో ‘భర్త మంచితనం/ఖరీదెంత?/ కట్టుకున్న భార్య/సహనమంత?’ అంటూ వైవాహిక జీవితంలో భార్య పాత్రను చెప్పారు. అలాగే ‘గోరింటాకు/ఆడపిల్ల/అరచేతిలో పండాలి/కళ్లలో కాదు’ అంటూ ఆడపిల్లను అలంకార వస్తువుగా చూసే సమాజపు దురభిప్రాయంపై కవయిత్రి తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

కవయిత్రి శారదా అశోకవర్ధన్ తన నానీల్లో జీవితసత్యాలను ప్రతిఫలించారు.‘పద్యం వుందా?/ అమ్మే /ఒక మహాపద్యం/ కదా’ అంటూ అమ్మ గొప్పదనాన్ని చాటారు. మరో నానీ లో ‘అద్దంలాంటిదే/కదా మనసు/మాటల రాళ్లేస్తే/బీటలు వారింది’ అంటూ కుండబద్దలు కొడతారు. కవయి త్రి అరుణ తన ‘గుప్పెడు గింజలు’ సంపుటిలో ‘జీవితం/నాకెంతో ఇచ్చింది/లాగేసుకుంది కూడా/ఎక్కువే’ అం టూ నిట్టూరుస్తారు.

మరో నానీలో ‘మా నాన్న చెరుకు/ పండించేవాడు/ అందుకే అనుబంధాల్లో/అంత తీపి’ అంటూ చమత్కరిస్తారు. డాక్టర్ కృష్ణకుమారి తన ‘అక్షరస్వరాలు’ సంపుటిలో ‘రంగు వేసితే/ కేశాలు నల్లబ డ్డాయా?/మరి/ యౌవనం సంగతి?’ అంటూ మనల్ని ఆలోచనలోకి పడేస్తారు. ‘హలో దెబ్బకి/ఉత్తరం చచ్చింది/ఆత్మీయతా /నువ్వెక్కడున్నావ్?’ అంటూ మరో నానీ లో వాపోతారు.

కవయిత్రి అడ్వాల సుజాత ‘మట్టి మల్లె లు’ సంపుటిలో ‘జాతీయదాయంలో/ కలవనిదేది/ ఆడదాని/అరవ చాకిరీ’ అంటూ స్త్రీ వెట్టిచాకిరీపై నానీ సంధి స్తారు. ఆచార్య సూర్య ధనుంజయ నాయక్ తన ‘బంజా ర నానీలు’ సంపుటిలో ‘ఆహా.. లంబాడీ/ వనిత వయ్యారం/ ఇది శ్రమలోంచి పుట్టిన/మయూరం’ అని వర్ణిస్తారు. మరో నానీలో ‘ఆ తండాలో/కొండగాలి లేదు /బంజారాహిల్స్/ బంజారాలు లేనట్లు’ అంటూ చమత్కరిస్తారు.

కొప్పరి పుష్పాదేవి తన‘పుష్పరాగాలు’ సంపు టిలో ‘రోగం వస్తే/ వచ్చింది కానీ/ఆత్మీయులు/ఎందరెందరో తెలిసింది’ అంటూ బాంధవ్యాల వాస్తవిక తను తెలియజేస్తారు. కవయిత్రి లహరి ‘ముఖానికి/ ముసుగువేస్తావు/ లోపలి వ్యథకు/ వేయగలవా!?’ అం టూ ప్రశ్నిస్తారు

. కవయిత్రి పాతూరి అన్నపూర్ణ తన ‘హృదయాక్షరాలు’ నానీలో ‘కాగితాన్ని/ చులకన చేయకు/అండగా/ అక్షరాలున్నాయి’ అంటూ ఆత్మ సాక్షాత్కారాన్ని, అక్షరాల పట్ల తనకున్న నిలకడను ప్రకటిస్తారు. అనిశెట్టి రజిత తన ‘గోరంత దీపాలు’ సంపుటిలో దైనందిన జీవిత ఘటనలను, వ్యక్తిగత భావాలను నానీల ద్వారా వ్యక్తీకరించారు. అలాగే యశశ్రీ రంగనాయకి, అనిశెట్టి రజిత, డాక్టర్ విజయశ్రీ, నాంపల్లి సుజాత, ఎస్ అరుణ, బీ గీతిక, జయప్రద, తులసి, ఫాతిమా, వింధ్య వాసిని వంటి కవయిత్రులు విద్య, వివాహం, అమ్మతనం, స్త్రీ జీవితం వంటి అంశాలను తమ నానీల్లో ప్రతి బింబించారు.

సామాజిక అంశాలపై శక్తిమంతమైన స్వరాన్ని వ్యక్తీకరించారు. బాలసాహిత్యంలో కందేపి రాణీప్రసాద్, కోపూరి పుష్పాదేవి, డాక్టర్ పెళ్లకూరి జయప్రద, మోచర్ల రామలక్ష్మి, గురజాడ శోభాపేరిందేవి, పాతూరి అన్నపూర్ణ, సీహెచ్ సునీత, బిగీతిక వంటి కవయిత్రులు నానీలు రాస్తున్నారు. తమ సంపుటాలను వెలువరుస్తున్నారు.

పరిశోధనలు.. విమర్శలు

నానీ ప్రక్రియపై తెలుగులో ఎన్నో పరిశోధనా పుస్తకాలు, వ్యాస సంపుటాలు వెలువడ్డాయి. 2006లో ఆచార్య ఎస్.రఘు సంపాదకత్వంలో ‘నానీలు సంవేక్షణం’, ‘నానీల దశాబ్ది’ పుస్తకాలు వెలువడ్డాయి. దాస్యం సేనాధిపతి ‘నానీ కవుల డిక్షనరీ’ ఎంతో ప్రాచుర్యం పొందింది. 2007లో ‘కవయిత్రుల నానీలు’ పుస్తకం ద్వారా రచయిత్రి సి.భవానీదేవి నానీ ప్రక్రియ శైలి, భా వోద్వేగాలు, సామాజిక అంశాలపై విశ్లేషణ అందించారు. నానీలపై ప్రశంసలే కాదు..

విమర్శలూ ఉన్నాయి. విమర్శకుడు దూడం నాంపల్లి స్త్రీ కవయిత్రులు భుజాని కెత్తుకున్న నానీ ప్రక్రియను తక్కువగా భావించి విమర్శ రాసిన సందర్భమొకటి ఉంది. మరో విమర్శకురాలు ముప్పాళ్ల రంగనాయకమ్మ 2006లో ‘నువ్వు రాసినా, నేను రాసినా, ఎక్కడో వుంటుంది ఒక మెరుపు! నానీలకు ఒకరు తండ్రా? ఒకరు తల్లా? అయినా.. రాస్తా నానీలే’ అంటూ విమర్శించారు. తెలుగు సాహిత్యంలో ఇప్పటివరకు 250కి పైగా నానీల సంపుటాలు వెలువడ్డాయి.

దీన్నిబట్టి ఈ ప్రక్రియ కాలపరీక్షలో ఎలా గెలిచి నిలబడిందో అర్థం చేసుకోవచ్చు. నానీ ప్రక్రియలో వ్యంగ్యం, హాస్యం, సామాజిక విమర్శ, వ్యక్తిగత అనుభవ ప్రతిబింబం, ధ్వని విన్యాసం, భావ-తీవ్రత సమన్వయంగా ఉం డటం, వాటి స్థిరత్వానికి కారణం. పుస్తకాలు, వ్యాసాలు, సమీక్షలు నానీ ప్రక్రియకు విశ్లేషణాత్మక, సిద్ధాంతాత్మక స్థాయినిచ్చాయి.

ఏదీ ఏమైనా ఇటీవల నానీ కవిత్వం తగ్గిందనే చెప్పాలి. నాలుగు పాదాల్లో అనంత విషయా లు చెప్పగలిగేది ఇద్దరు మాత్రమే. ఒకరు స్త్రీ. రెండోది నానీ. మళ్లీ ఈ ప్రక్రియ స్త్రీ కవయిత్రుల ద్వారానే శోభయామానం కావాలని కోరుకుందాం.