07-08-2025 12:44:54 AM
ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు
కలెక్టరేట్ ఎదుట వంట కార్మికుల ధర్నా
ఖమ్మం, ఆగస్ట్ 6(విజయ క్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట కార్మికులకు సకాలంలో బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అరకొరగా పెరిగిన మెస్ ఛార్జీలతో విద్యార్థులకు పోషక ఆహారం అందించడం ఎలా సాధ్యమవుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర -మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర కమిటీ సభ్యులు నిమ్మటూరి రామకృష్ణ మాట్లాడుతూ గత డిసెంబర్ నెల -నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు, వేతనాలు, అల్పాహార బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను తక్షణమే చెల్లించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దండు ఆదినారాయణ, -ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మి నారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి గుండెపంగు మల్లేష్, సంఘం జిల్లా కమిటీ సభ్యులు పిల్లి భాస్కర్, నాయకులు రామారావు, నాగరాజు, రంజాన్బీ, పిల్లి బుచ్చాలు, వెంకటేశ్వరరావు, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ నాయకురాలు కుంట వెంకమ్మ, మహదేవ లక్ష్మి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.