calender_icon.png 16 May, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిగేలు రాణి మళ్లొస్తోంది!

16-05-2025 12:32:45 AM

‘రంగస్థలం’లో యువతను ఉర్రూతలూగించిన ‘జిగేలు రాణి’ మళ్లీ వస్తోందా? అంటే చాలా మంది నుంచి ఔననే సమాధానమే వస్తోంది. రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఆ సినిమాలో ప్రత్యేక గీతంలో జిగిలున మెరిసిన పూజా హెగ్డే కుర్రాళ్ల గుండెల్ని తన రాణివాసంగా మార్చుకుంది. ఇప్పుడు ‘పెద్ది’తో కలిసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు వస్తోందట.

రామ్‌చరణ్ రాబోతున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 30 శాతం పూర్తయిందని.. కథానాయకుడు రామ్‌చరణ్ ఇటీవల లండన్‌లో జరిగిన ఈవెంట్‌లో చెప్పారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకా జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు లాంటి స్టార్స్ ఇందులో భాగమవుతున్నారు. వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుందని, ఆ ప్రత్యేక గీతంలో టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుందని తెలుస్తోంది.

ఈ పాటలో శ్రీలీల నటిస్తుందని మొన్నటివరకు ప్రచారం జరగ్గా, ఇప్పుడు అనూహ్యంగా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. రంగస్థలంలో జిగేలు రాణిగా అదరగొట్టిన పూజ.. మరోమారు పెద్దిలో రచ్చ చేసేందుకు వస్తోందన్న వార్త అధికారికం కాకపోయినప్పటికీ ఆమె అభిమానుల్లో మాత్రం కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.