09-01-2026 12:11:15 AM
అధికార కాంగ్రెస్ లో ఆశావాహుల మధ్య అంతర్గత చర్చలు
అనుభవం పార్టీ నిబద్ధత కీలక ప్రమాణం
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతకే అవకాశం ఇవ్వాలన్న భావన
అనుభవం, నిబద్ధతే చైర్మన్ ఎంపికలో కీలకమన్న అభిప్రాయం
రిజర్వేషన్ ఏదైనా సరే పార్టీ బలపడాలన్న ఆకాంక్ష
జనరల్ నుంచి ఎస్టి వరకు రిజర్వేషన్ లెక్కల కీలకం
నాలుగు పేర్ల చుట్టూనే సాగుతున్న కాంగ్రెస్ అంతర్గత చర్చ
చైర్మన్ రిజర్వేషన్ ఏదైనా& కాంగ్రెస్లో ఈ నాలుగు పేర్లే చర్చకు కేంద్రబిందువు
ఇల్లందు టౌన్, జనవరి 8, (విజయక్రాంతి): ఇల్లందు పట్టణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్గా మారాయి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవికి ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వస్తుందన్న అంశమే ఇప్పుడు పట్టణమంతా చర్చనీయాంశంగా మారింది. చాయ్ దుకాణాల దగ్గర మొదలుకొని పార్టీ కార్యాలయాల వరకు, వార్డు సమావేశాల నుంచి సామాన్య ప్రజల మాటల వరకు ఈసారి చైర్మన్ రిజర్వేషన్ ఏది? అన్న ప్రశ్నే ప్రధానంగా వినిపిస్తోంది.
రోస్టర్ విధానం ప్రకారం మార్పులు ఉంటాయా? లేక గత ఎన్నికల తరహాలోనే కొనసాగుతాయా? అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది. ఈ అనిశ్చితి మధ్య అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది రిజర్వేషన్ ఏదైనా సరే, పార్టీకి నిబద్ధతతో పనిచేసిన, ప్రజల్లో గుర్తింపు ఉన్న నాయకుడికే చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాల్లో నాలుగు పేర్లు మాత్రమే ప్రధానంగా చర్చకు రావడం విశేషంగా మారింది.
జనరల్ రిజర్వేషన్ డివికే బలమైన అవకాశం
చైర్మన్ పదవికి జనరల్ రిజర్వేషన్ కేటాయిస్తే మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు (డివి) పేరు అత్యంత బలంగా వినిపిస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ తరఫున చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన డివి, అవినీతికి తావులేకుండా పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారని, తన పాలనలో ఇల్లందు మున్సిపాలిటీకి జాతీయ స్థాయి అవార్డులు వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.
కౌన్సిలర్ల తిరుగుబాటు, అవిశ్వాస తీర్మానం వంటి రాజకీయ సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన అనుభవం ఆయనకు రాజకీయంగా మరింత బలం చేకూర్చిందని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్కు రాజీనామా చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన డివి, ఇల్లందు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ కారణాలతోనే జనరల్ రిజర్వేషన్ వస్తే మరోసారి డివికే చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ బహిరంగంగా వినిపిస్తోంది.
బీసీ రిజర్వేషన్ సాంబమూర్తి పేరు ముందంజ
ఒకవేళ చైర్మన్ పదవికి బీసీ రిజర్వేషన్ కేటాయిస్తే కాంగ్రెస్లో మడుగు సాంబమూర్తి పేరు మొదటి వరుసలో నిలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యకు అత్యంత సన్నిహితుడిగా, విశ్వాసపాత్రుడిగా పేరుగాంచిన సాంబమూర్తి, గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా పని చేసిన అనుభవంతో పాటు పట్టణ సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగిన నేతగా గుర్తింపు పొందారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన సమయం ఇదేనని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లో సాంబమూర్తికి ఉన్న పట్టుబలం, ప్రజలతో నేరుగా మమేకమయ్యే ఆయన శైలి చైర్మన్ పదవికి మరింత అనుకూలంగా మారుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ అయితే సాంబమూర్తికే అవకాశం ఇవ్వాలి అన్న స్వరం కాంగ్రెస్లో బలపడుతోంది.
ఎస్సీ రిజర్వేషన్ నవీన్ కుమార్కే గట్టి డిమాండ్
చైర్మన్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ వస్తే మాజీ కౌన్సిలర్ అంకెపాక నవీన్ కుమార్ పేరు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రధానంగా వినిపిస్తోంది. 22వ వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు కరోనా వంటి కష్టకాలంలో ప్రజల కోసం నిలబడి సేవలందించిన నాయకుడిగా నవీన్ కుమార్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉచిత వైద్య శిబిరాలు, మందుల పంపిణీ, పేదల దహన సంస్కారాలకు సహాయం వంటి కార్యక్రమాలతో ప్రజల్లో నమ్మకం సంపాదించుకున్నారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యే కోరం కనకయ్య గెలుపు కోసం చురుగ్గా పనిచేసిన ఆయనకు ఎస్సీ రిజర్వేషన్ వస్తే చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా కోరుతున్నాయి. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆశీస్సులు మెండుగా ఉండటంతో పాటు ఎస్సీ సామాజిక వర్గంలో మరో బలమైన అనుభవమైన నాయుడుకు లేకపోవడం నవీన్ కుమార్ కు కలిసివచ్చిన అంశం. సేవ, సాన్నిహిత్యం, నిబద్ధత ఈ మూడు నవీన్ కుమార్లో స్పష్టంగా కనిపిస్తాయి అన్న మాటలు ఇప్పుడు కాంగ్రెస్లో తరచుగా వినిపిస్తున్నాయి.
ఎస్టీ రిజర్వేషన్ అనసూయ మళ్లీ రేసులో
రోస్టర్ విధానంలో ఎస్టీ రిజర్వేషన్ కేటాయిస్తే మాజీ మున్సిపల్ చైర్మన్ యదలపల్లి అనసూయ పేరు మళ్లీ రాజకీయ చర్చల్లోకి వస్తోంది. గతంలో చైర్మన్గా పనిచేసిన అనుభవం, తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఆమెకు బలంగా మారుతున్నాయని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీకి విధేయురాలిగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం, కార్యకర్తలతో నేరుగా మమేకమవడం ఆమెకు ప్రత్యేకమైన ప్లస్గా మారిందని చెబుతున్నారు. ఎస్టీ వర్గాల్లో ఆమెకు ఉన్న ఆదరణ, పాలనా అనుభవం దృష్ట్యా రిజర్వేషన్ అదే వర్గానికి వస్తే అనసూయకు మరోసారి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.
మొత్తంగా రాజకీయ సమీకరణలు
ఇల్లందు మున్సిపల్ ఎన్నికలు ఈసారి సాధారణ స్థానిక ఎన్నికలుగా కాకుండా, అధికార కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ దిశను నిర్దేశించే కీలక ఎన్నికలుగా మారుతున్నాయి. చైర్మన్ రిజర్వేషన్ జనరల్ అయినా, బీసీ అయినా, ఎస్సీ లేదా ఎస్టీ అయినా డివి, సాంబమూర్తి, నవీన్ కుమార్, యదలపల్లి అనసూయ ఈ నాలుగు పేర్ల చుట్టూనే రాజకీయ చర్చ తిరుగుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్లో అంతర్గత రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.