09-01-2026 12:24:04 AM
కొత్తపల్లి, జనవరి 8(విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. రేకుర్తి 19వ డివిజన్ లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట సమీపంలో సర్వే నంబర్ 194 లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు దర్జాగా చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి గుట్టలను సైతం పగలగొడుతూ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఇటీవల రేకుర్తిలో ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చారని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు విచారణ చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు మల్లి తాజాగా 194 సర్వే నంబర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో కొత్త ఇంటి నిర్మాణాలు చేపట్టడం చర్చనీయంశంగా మారింది.
దీనితో మున్సిపల్ యంత్రాంగంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దింతో పాటు పక్కనే ఉన్న 164 సర్వే నంబర్లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం పేరుతో ఇళ్ళు లేని నిరుపేదలకు గృహాలను నిర్మించి ఇచ్చింది. అందులో మిగులు భూమి కూడా ఉండడంతో, ఇప్పుడు ఈ రెండు సర్వే నెంబర్లు పక్కపక్కనే ఆనుకుని ఉండటంతో ప్రయివేట్ సర్వే నెంబర్ లో ఇంటి నిర్మాణాలు చేస్తున్నారా, లేక ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్నారనేది ప్రశ్నర్థకంగా మారింది. ఈ సమస్య పై స్థానికులు అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసిన లాభం లేకుండా పోయిందాన్నారు. ఏది ఏమైనా రెవెన్యూ అధికారులు 164 సర్వే నెంబర్ ను సర్వే చేసి ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక 194 సర్వే నెంబర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్న నిర్మాణాలను మున్సిపల్ అధికారులు గుర్తించి వాటిని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
రేకుర్తి లోని 19వ డివిజన్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకొని, అక్రమంగా నిర్మించిన కట్టడలను మునిసిపల్ అధికారులు కూల్చి వేయాలి.
గుంటి వినీత్, స్థానికుడు