calender_icon.png 19 July, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్ర సంస్థగా ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’

19-07-2025 01:01:09 AM

  1. గుర్తించిన అమెరికా విదేశాంగ శాఖ
  2. లష్కరే తోయిబాకు టీఆర్‌ఎఫ్ ముసుగు సంస్థ అని ప్రకటన
  3. యూఎస్ నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
  4.     2023లోనే టీఆర్‌ఎఫ్‌పై భారత ప్రభుత్వం నిషేధం

న్యూఢిల్లీ, జూలై 18: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను ఊచకోత కో సిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ను అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు టీఆర్‌ఎఫ్ ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శుక్రవారం వెల్లడించారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ (ఎఫ్‌టీవో)గా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్ డీజీటీ) ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తున్న ట్టు మార్కో రూబియో తెలిపారు.

2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న దాడుల్లో పహల్గాం ఘటనే అతి పెద్దదని ఆయన అన్నారు. భారత భద్రత దళాలలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్‌ఎఫ్ బాధ్యత వహించిందన్నారు. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని భారత్ స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేసింది.

ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్రసంస్థగా గుర్తించడంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆయన విభాగం చేసిన కృషిని ప్రశంసిస్తూ భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. హిందువులను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడిలో 26 మంది పౌరుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు.

దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్‌ఎఫ్ ప్రకటించుకుంది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌పై దాడులు చేపట్టి ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసింది. వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు పాక్‌లోని వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.

పేరుకే టీఆర్‌ఎఫ్.. అంతా లష్కరే కనుసన్నల్లోనే

టీఆర్‌ఎఫ్ 2019లో లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఏర్పడింది. ఇది లష్కరేకు ఉన్న మరో పేరు మాత్రమే. పుల్వామా దాడి, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎప్‌ఏటీఎఫ్) పరిశీలన నుంచి తప్పించుకునేందుకు పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ వ్యూహకర్తలు టీఆర్‌ఎఫ్ అనే పేరుతో లష్కరే తోయిబా కోర్ గ్రూప్‌ను తెరమీదకు తీసుకొచ్చారు.

గత నాలుగేండ్లుగా కశ్మీర్‌లో వలస కార్మికులు, కశ్మీరీ పండిట్లతో పాటు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నది. 2021 జూన్‌లో జమ్మూలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) స్టేషన్‌పై డరోన్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2023 జనవరిలో టీఆర్‌ఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.