24-01-2026 12:00:00 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 23, (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన వజ్రాయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపు నిచ్చారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని, ఆ విలువను ప్రతి ఓటరు తెలుసుకొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.
ఓటు హక్కుపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన పాలనను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. అధికారులు, యంత్రాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల యువత ఓటరుగా నమోదు చేసుకునేలా, అలాగే తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విస్తృత స్థాయిలో ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లేనినా, బీసీ సంక్షేమ శాఖ అధికారిని విజయలక్ష్మి, ఏ ఓ అనంత రామకృష్ణ ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది నవీన్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.