calender_icon.png 11 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకమైంది

11-09-2025 12:34:55 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : విద్యార్థులకు సరైన విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తులో సత్ప్రవర్తన కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దటంలో  ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన గురుపూజోత్సవం 2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయుడుగా ప్రయాణం మొదలుపెట్టి రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ గా ఎన్నో గొప్ప పదవులు పొంది ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నదని ఈ సందర్భంగా అన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లను ఎంతగానో పెంచారని అలాగే నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ఫలితాల్లో కూడా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నారన్నారు.

అలాగే చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని ముందంజలోకి తీసుకొని రావాలన్నారు. తదుపరి జిల్లాలో ఎంపికైన 40 మంది ఉత్తమ ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులకు సన్మానం చేసి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కే అశోక్, కోఆర్డినేటర్లు శ్రావణ్ కుమార్, రాంబాబు, పూలమ్మ,జాతీయ అవార్డు గ్రహీత మారం పవిత్ర, రాష్ట్రీయ అవార్డు గ్రహీతలు చత్రు నాయక్, యల్లయ్య, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.