07-10-2025 12:10:36 AM
అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిద్ధిపేట కలెక్టరేట్,అక్టోబర్ 6 :జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు.సోమవారం ఐడిఓసీ సమావేశ మందిరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులకు చివరి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల బాధ్యతలు అత్యంత కీలకమైనవి అని పేర్కొన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా శిక్షణ ఇచ్చినట్లు, ఈ చివరి విడతలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకొని రిటర్నింగ్ అధికారులు కర దీపికను పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల సమయంలో మనమంతా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.నామినేషన్ల సమయంలో అభ్యర్థితో పాటు ముగ్గురు మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి రావచ్చని, ఒక్క వాహనం మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు. స్థానిక పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాట్లను సరిచూడాలని ఆమె సూచించారు.
ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎన్నికల నిబంధనలను వివరించాల్సిందిగా సూచించారు. ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు నిఘా బృందాలతో సమన్వయం సాధించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, డిపిఓ దేవకీదేవి, డిఆర్‌ఓ నాగరాజమ్మ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.