03-05-2025 12:00:00 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మే 2 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మొదటి విడతలో మంజూరు అయిన ఇళ్లు త్వరగా గ్రౌండింగ్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంపీడీఓ లను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపిఒ లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు.
జనవరి 26న మొదటి విడతలో ప్రతి మండలం నుంచి ఒక్కో గ్రామానికి పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని 1300 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం 414 మంది లబ్ధిదారులు మాత్రమే నిర్మాణం ప్రారంభించుకున్నారని, వాటిలో 94 బేస్మెంట్ వరకు పూర్తి అయ్యాయని, 54 ఇళ్లకు మొదటి విడత బిల్లు పేమెంట్ అయినట్లు తెలిపారు.
అందువల్ల ఎవరైతే ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించుకోలేదో వారితో రేపు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైనా మాకు ఇష్టం లేదు అంటారో వారి నుండి లిఖిత పూర్వకంగా రాయించుకోవాలని ఆదేశించారు. ఇష్టం లేని వారిస్తానంలో ఇతర పేద కుటుంబాలకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ మే 10 నాటికి పూర్తి కావాలని ఆదేశించారు.
నిర్మాణం ప్రారంభించిన వారు 600 చదరపు అడుగులలో మాత్రమే కట్టుకోవాలని ఎవరైనా ఎక్కువ స్థలంలో ఇల్లు ప్రారంభించుకొని ఉంటే కుదించుకునే విధంగా ఒప్పించాలని లేనిపక్షంలో ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేయాలని సూచించారు.
రెండవ విడతలో భాగంగా ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా లక్ష్యం మేరకు ప్రత్యేక అధికారులు స్క్రూటినీ చేసిన జాబితాను కలెక్టర్ లాగిన్ కు పంపించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, హౌసింగ్ పి.డి. పర్వతాలు, డి. ఈ విటోభ, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఒ లు తదితరులు పాల్గొన్నారు.