15-12-2025 12:00:00 AM
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా కొనసాగాయి. ఫేజ్2 పరిధిలోని ఆరు మండలాల్లో 113 సర్పంచ్,992 వార్డు సభ్యుల కు ఎన్నికలు జరగగా గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం గణనీయం గా నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారుల ప్రకారం 6మండలాలో మొత్తం 1,31,278 మంది ఓటర్ల ఉండగా 1,13,733 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దీంతో 86.64 పోలింగ్ శాతం గా నమోదైంది.బేజ్జూరు 83.70 శాతం, చింతలమానేపల్లి 87.20 శాతం,దహేగాం 90.44 శాతం ,.కౌటాల 84.94 శాతం, పెంచికల్పేట 90.26 శాతం, సిర్పూర్ (టి) 85.43 శాతం ఓటింగ్ నమోదైంది.ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారు లు తీరగా, మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పెంచికలపేట మండ లంలో. బొంబాయిగూడా, చెడ్వాయి, సిర్పూర్ టీ గ్రామపంచాయతీలలో జరుగుతున్న రెండో విడత పోలింగ్ ఎన్నికల సరళిని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల తో కలిసి పరిశీలించారు. ప్రజలు ప్రశాంతంగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అతి కీలకమైనదని కలెక్టర్ అన్నారు.ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. అధికారులు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు ఎస్పి నితిక పాటిల్ తెలిపారు.
పారదర్శకంగా ఎన్నికలు:- కలెక్టర్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల నిర్వహణ జిల్లాలో ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో రెండవ విడతలో జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్ తో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండవ విడతలో భాగంగా 6 మండలాలలో గల గ్రామపంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు 1 లక్ష 31 వేల 258 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, పోలింగ్ కేంద్రాలలో వరుస క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.