15-12-2025 12:00:00 AM
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల, డిసెంబర్ 14 : ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులు వినియోగించి ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఖండించారు. ఆది వారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు కష్టపడి సంస్థకు లాభాలు తెచ్చి పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ప్రాంతానికి సంబంధం లేని కార్యక్రమాలకు సింగరేణి నిధులు ఖర్చు చేయడాన్ని దుయ్యబట్టారు.
మెస్సీ పర్యటనను బీజేపీ స్వాగతి స్తుంది, కానీ దానికి సింగరేణి నిధులు ఉపయోగించి ఏర్పాట్లు చేయడాన్ని ఖండిస్తున్నా మన్నారు. కార్మికుల కుటుంబాలకు సరైన క్వార్టర్లు, కాలనీల్లో తాగు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్మికులకు ఇస్తానన్న 200 గజాల స్థలం ఏమైందని ప్రశ్నించారు.
సింగరేణి కార్మికులు కష్టపడి సంస్థకు లాభాలు తెస్తుంటే ప్రభుత్వం మాత్రం సింగరేణి నిధులు పక్కదారి పట్టిస్తుంటే జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ నిధులు అన్ని వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్, సింగరేణి కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం జాజు, గాజుల ముఖేష్ గౌడ్, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, కుర్రె చక్రవర్తి, బింగి ప్రవీణ్, రావణవేణి శ్రీనివాస్, రాకేష్ రెన్వ, మద్ది సుమన్, చిరంజీవి, ఆకుల నరేందర్, బద్రి శ్రీకాంత్, మాడిశెట్టి మహేష్, కట్కూరి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.