07-05-2025 12:14:50 AM
కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, మే 6 (విజయక్రాంతి): విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటో రియంలో నిర్వహించిన విద్యుత్ భద్రత వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. టీజీఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నారు.
కామారెడ్డి డివిజన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులు భద్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. విధి నిర్వహణలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, 24 గంటల విద్యుత్ సేవలను నిస్వార్థంగా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.
ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులందరూ భద్రతా నిబంధనలు తగిన విధంగా పాటించడమే కాకుండా, విధుల్లో నిష్టతో కూడిన ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. అనంతరం, డాక్టర్ రమేష్ బాబు (అనస్తీసియా స్పెషలిస్ట్) విద్యుత్ ప్రమాదాల సందర్భంలో తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్సలు, సీపీఆర్ చేయవలసిన విధానాన్ని కార్యాచరణా త్మకంగా వివరించారు.
ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బంది కళాబృందం నిర్వహించిన నాటకం ద్వారా వ్యవసాయదారులకు విద్యుత్ సంబంధిత ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజినీర్‌లు (టెక్నికల్ & భద్రత అధికారి) ఎం. ప్రభాకర్ , డివిజనల్ ఇంజినీర్ (ఆపరేషన్) కళ్యాణ చక్రవర్తి , డివిజనల్ ఇంజనీర్ (ఎంఆర్టీ) నాగరాజు పాల్గొని, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఈలు, సబ్ ఇంజినీర్‌లు, వో అండ్ ఎం సిబ్బంది, సబ్‌స్టేషన్ ఆపరేటర్స్, స్థానికి ప్రజలు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.