07-05-2025 12:14:47 AM
-తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి
ముషీరాబాద్, మే 6 (విజయక్రాంతి): ఆస్తమాపై ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపం చ ఆస్తమా దినోత్సవం సందర్భంగా మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకానాథ్‌రెడ్డి ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నూతన టెక్నాలజీతో వచ్చిన ఇన్‌హేలర్స్‌ను ఆవిష్కరిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన కే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అత్యాధునిక శాస్త్రీయ వైద్యం అందుబాటులో వస్తున్నప్పటికీ జబ్బులు కూడా అదే రీతిలో విజృంభిస్తున్నాయని వాపోయారు.
శ్వాస హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ విష్ణు రావు మాట్లాడుతూ.. ఉచ్ఛ్వాస, నిశ్వాస సజావుగా సాగితేనే మనిషి మనుగడ సాధ్యమని చెప్పారు. శ్వాసకు అడ్డంకులు ఏర్పడుతుంటే,ఆ నరకం అనుభవించిన వారికే తెలుస్తోందని విష్ణురావు తెలిపారు. ఆస్తమా రోగులకు ఊపిరి తీసుకోవడం ఒక్కోసారి ప్రాణం పోయినంత పని అవుతుందని తెలిపారు. మనుషుల జీవనశైలి, వాతావరణ కాలుష్యం ప్రధానంగా ’ఆస్తమా’ను పెంచి పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆస్తమాతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఆస్తమా వచ్చిందంటే పూర్తిగా వదిలిపోవడం చాలా కష్టమని అన్నారు. మొదటి దశలో వైద్యులను సంప్రదిస్తే సరైన జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రింవచ్చని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇన్‌హేలర్స్ అందరికీ అందుబా టులో ఉండాలన్న నినాదంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐజేయూ సీనియర్ నాయకులు కల్లూరి సత్యనారాయణరెడ్డి, శ్వాస ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.