04-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 3(విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్‌జీవోస్) కేంద్ర సంఘం ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారిణి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు శనివారం హైదరాబాద్ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారమ్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎంహుస్సేని (ముజీబ్), అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరై, సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే కేవలం ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అని కొనియాడారు. సమాజంలో మహిళా విద్యకు పునాదులు వేసిన ఆమె కృషి వల్లనే నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని (ముజీబ్) మాట్లాడుతూ అజ్ఞానమనే చీకటిని అక్షర జ్ఞానంతో పారద్రోలిన ధీశాలి సావిత్రిబాయి అని కొనియాడారు.
అంటరానితనం, వివక్ష వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి దిక్సూచి అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఆమెను స్ఫూర్తిగా తీసుకుని, విధి నిర్వహణలో నిబద్ధతతో ఉంటూనే, సామాజిక బాధ్యతలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. సభ్యులు ఐకమత్యంతో సంఘం బలోపేతానికి తోడ్పడాలన్నారు. కార్యక్రమం లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వరద రాజు, ఈసీ మెంబర్ ఏవీ శ్రీధర్‌తో పాటు పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల అధ్యక్షులు శంకర్, వి శ్రీనివాస్, వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.